12-04-2025 10:57:04 AM
హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(MLC Vijayashanti) దంపతులకు బెదిరింపులు రావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది. దీంతో ఎమ్మెల్సీ విజయశాంతి భర్త ఎం.వి. శ్రీనివాస ప్రసాద్‌కు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్(Banjara Hills Police Station)లో ఫిర్యాదు చేశారు. నిందితుడు ఎం. చంద్రకిరణ్ రెడ్డిగా గుర్తించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఎం.వి. శ్రీనివాస ప్రసాద్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ గా చంద్రకిరణ్ రెడ్డి ఆయనను పరిచయం చేసుకున్నాడు. ఆయన పనిపై ప్రాథమిక అంచనా వేసిన తర్వాత శ్రీనివాస ప్రసాద్ భవిష్యత్తులో కాంట్రాక్ట్ పొందే అవకాశం ఉందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయశాంతి వద్ద సోషల్ మీడియా హ్యాండ్లర్(Social media handler) గా అవకాశం ఇవ్వాలని కోరినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. చంద్రకిరణ్ రెడ్డి తమతో కలిసి పనిచేస్తూ సొంత వ్యాపారాన్ని బలపరుచుకున్నాడని శ్రీనివాస్ ప్రసాద్ ఆరోపించారు.
చంద్రకిరణ్ రెడ్డి స్వలబ్ధి కోసం తమ పేరును వాడుకున్నాడని ఆయన తెలిపారు. పని తీరు నచ్చక చంద్రకిరణ్ సేవలను ఉపయోగించుకోలేదని విజయశాంతి భర్త చెప్పారు. తాము బీజేపీలో ఉన్నప్పుడు చంద్రకిరణ్ తో పరిచయం ఏర్పడిందని శ్రీనివాస్ ప్రసాద్(Srinivas Prasad) స్పష్టం చేశారు. బీజేపీలో ఎదిగేందుకు చంద్రకిరణ్ రెడ్డి తమను వాడుకున్నాడని ఆరోపించారు. బీజేపీలోంచి బయటకు వచ్చాక చంద్రకిరణ్ రెడ్డి(Chandrakiran Reddy) నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పారు. పెండింగ్ లో ఉన్న నగదు చెల్లింపులు చేయగలరా అని చంద్రకిరణ్ రెడ్డి మెసేజ్ చేశాడని, దానికి తమ వద్ద బకాయిలు ఏమీ లేవని సమాధానమిచ్చామని విజయశాంతి దంపతులు తెలిపారు. ఏప్రిల్ 6న చంద్రకిరణ్ రెడ్డి బెదిరింపు సందేశం పంపాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. బకాయిలు తీర్చకుంటే మీరే శత్రువులు అవుతారని మెసేజ్ చేశాడని తెలిపారు. ఆమోదయోగ్యం కాని రీతిలో మెసేజ్ లు ఉన్నాయని, చంద్రకిరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విజయశాంతి దంపతులు ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ యాక్ట్ 351(2), 351(3) సెక్షన్ల కింద చంద్రకిరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.