* రాత్రంతా పరిగెత్తుతూ భారత్‌కు చేరిన బాలిక
* అదుపులోకి తీసుకున్న బీఎస్‌ఎఫ్
కలకత్తా, డిసెంబర్ 12: కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీలపై ఇస్లాం ఛాందసవాదులు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ భక్తురాలైన తనను కిడ్నాప్ చేసి తన కుటుంబసభ్యులను చంపుతామని ముస్లిం మతోన్మాదులు బెదిరించడంతో ఓ బాలిక రాత్రంతా పరిగెత్తుతూ భారత్‌కు చేరింది. ఈ విషాదకర ఘటన అందరినీ కలిచివేస్తోంది. బంగ్లాదేశ్‌లోని పంచగఢ్ జిల్లాకు చెందిన ఓ బాలిక(17) ఇస్కాన్ భక్తురాలు. ఆమె తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో దేశద్రోహం కేసు కింద ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేసింది.ఆయన ఆరెస్ట్‌పై ప్రపంచమంతటా నిరసనలు వ్యక్తం కావడంతో ఇస్కాన్ భక్తులను లక్ష్యంగా చేసుకుని మతోన్మాదులు వారిని వేధిస్తూ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈక్రమంలో ఇస్కాన్ భక్తురాలైన ఆ బాలికను కిడ్నాప్ చేస్తామని బెదిరించడమే కాకుండా మిగిలిన కుటుంబసభ్యులను కూడా చంపుతామని ఛాందసవాదులు బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఒంటరిగా రాత్రంతా పరుగెత్తి భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా సరిహద్దుకు చేరుకుంది.
అక్కడి నుంచి అక్రమంగా దేశంలోకి ప్రవేశించింది. దీంతో బాలికను బీఎస్‌ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. భారత్‌లోని జల్పాయ్‌గురి జిల్లాలో తనకు బంధువులు ఉన్నారని, వారి వద్దకు వెళుతున్నట్లు విచారణలో తెలిపింది. భారత్‌కు వచ్చిన బాలిక విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ కోరారు.