ప్రభుత్వ ఉద్యోగిని నుంచి 4.21 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): మనీలాండరింగ్ కేసులో డిజిటల్ అరెస్ట్ చేశామని ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరింపులకు గురిచేసి, ఆమె ఖాతా లోని రూ.4.21 లక్షలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ మహిళా ప్రభుత్వ ఉద్యో గికి ఇటీవల ట్రాయ్ పేరుతో ఓ ఫోన్ వచ్చిం ది. ఆమెతో మాట్లాడిన వ్యక్తి, ఆ తర్వాత ఫోన్ కాల్‌ను సీబీఐ అధికారికి బదిలీ చేస్తున్నట్లు తెలిపాడు. దీంతో లైన్‌లోకి వచ్చిన మరో వ్యక్తి.. మీరు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, మీ ఆధార్‌కార్డు ఉపయోగించి ముంబైలోని ఓ బ్యాంక్‌లో ఖాతా తెరిచినట్లు తెలిపాడు. అదేవిధంగా మీ పేరుపై సిమ్‌కార్డ్ యాక్టివేట్ చేయబడిందని, దాని నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయని పేర్కొన్నాడు. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామని, విచారణ పూర్తయ్యే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని తెలిపాడు. విచారణ నిమిత్తం బాధితురాలి ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఆర్బీఐ రూల్స్ ప్రకారం తాము సూచించిన బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తామని నమ్మించాడు. దీంతో రూ. 4.21 లక్షలు బదిలీ చేసింది. అనంతరం అవతలి వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.