calender_icon.png 11 February, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్‌ఎంపీ, పీఎంపీలపై బెదిరింపులా?

11-02-2025 01:44:05 AM

ఆర్‌ఎంపీ, పీఎంపీల నిరసనలో మాజీ మంత్రి హరీశ్‌రావు

ముషీరాబాద్, ఫిబ్రవరి 10: బీఆర్‌ఎస్ హయాంలో ఆర్‌ఎంపీ, పీఎంపీలపై ఎలాం టి దాడులు, కేసులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో భయభ్రాంతులకు గురిచేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు రోడ్డుపైకి ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ గ్రామీణ వైద్యుల సమాఖ్య, ధన్వంతరీ అనుభవ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఆర్‌ఎం పీలు, పీఎంపీలు సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజర య్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై ఆరోగ్యశాఖ వేధింపు లు ఆపాలన్నారు. ఈ విషయమై సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి స్పందించాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి ఆర్‌ఎంపీలు చురక పెట్టాలన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ధన్వంతరీ అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షుడు మంగరి విష్ణు, ప్రధాన కార్యదర్శి కొమ్ము రాము, ఉప్పల రవి, హరికృష్ణ, శోభన్‌బాబు, నిరంజన్ రెడ్డి, నరహరి, ఈశ్వర్ పాల్గొన్నారు. 

కూల్చివేతలను ఆపండి

రాజేంద్రనగర్: బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం చేపట్టిన ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేతలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. సోమవారం ఆయన బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని సన్ సిటీలో మున్సిపల్ అధికారులు కూల్చివేతలు జరుపుతుండగా ఆయన గమనించి తన వాహనాన్ని ఆపారు.

కూల్చివేతలు నిలిపివేయాలని మున్సిపల్  సిబ్బం దిని కోరారు. ఫుట్‌పాత్‌లపై షెడ్లు, డబ్బాలు వేయడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్ర వివరించారు.  ఇష్టారాజ్యంగా కూల్చివేతలు  సబబు కాదని హరీశ్‌రావు అన్నారు.

అర్హతలేని ఆర్‌ఎంపీ, పీఎంపీలకు మద్దతా?

ఇందిరాపార్కు వద్ద అర్హతలేని వైద్యులు ఆర్‌ఎంపీలు, పీఎంపీలు చట్టబద్దమైన గుర్తింపు కోసం నిర్వహించిన నిరసనలను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది.  వీరికి మాజీ మంత్రి హరీష్‌రావు మద్దతు ఇవ్వడం సరికాదని జూడాలు ఖండించారు. వైద్య శాఖకు మంత్రిగా పని చేసిన హరీష్‌రావు అక్రమ వైద్యులకు మద్దతు ఇవ్వడం ఆందోళన కలిగించే విషయమన్నారు.