- దెబ్బ కొట్టనున్న కమెడియన్ జాత్యాహంకార వ్యాఖ్యలు
- ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న ప్యూర్టోరీకో, లాటిన్ ప్రజలు
- అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ స్టేట్లలో వీరి ఓట్లే కీలకం
- ట్రంప్ విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం
వాషింగ్టన్, అక్టోబర్ 30: సాఫీగా సాగుతోన్న రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో అనుకోకుండా ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ చివరి భారీ బహిరంగ సభ అనూహ్యంగా పెద్ద వివాదానికి దారితీసింది. ఇందుకు కారణం ట్రంప్ కాకపోయినప్పటికీ ఎన్నికల్లో ఆయనపై ప్రభావం పడే అవకాశం ఉంది.
న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్వేర్ గార్డెన్‌లో జరిగిన ట్రంప్ ప్రచార కార్యక్రమం చివరకు ప్యూర్టోరికన్లు, లాటిన్ అమెరికన్లు, యూదులు, ఆఫ్రో ఆమెరికన్లపై స్టాండప్ కమెడియన్ టోనీ హించ్‌క్లిఫ్ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాకుండా ప్యూర్టోరీకో దీవిని సముద్రంలో తేలియాడే చెత్తగా అభివర్ణించారు.
దీంతో రిపబ్లికన్ పార్టీ పట్ల ఆయా వర్గాల ఓటర్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. అమెరికాలో ఈ వర్గాలకు చెందిన ఓటర్లు 60 లక్షల మంది ఉన్నారు. జాత్యాహంకార వ్యాఖ్యలతో పాటు తమ ద్వీపాన్ని అవహేళన చేయడంతో వాళ్లంతా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశముంది.
ఏం జరిగింది?
కరీబియన్ దీవుల్లో ఒకటైన ప్యూర్టోరీకో గతంలో స్పెయిన్ అధీనంలో ఉండేది. 1898లో స్పెయిన్‌తో యుద్ధం తర్వాత అమెరికా స్వాధీనం చేసుకుంది. 1917లో అక్కడి ప్రజలకు అమెరికా పౌరసత్వం ఇచ్చింది. 1940లలో ఇక్కడి ప్రజలు అధిక సంఖ్యలో అమెరికాకు వలస వచ్చారు. అమెరికా ఓటర్లలో మెక్సికన్ల తర్వాత హిస్పానియన్ ప్రజలు రెండో అతిపెద్ద వర్గంగా నిలిచారు.
వీరిలో ఎక్కువమంది ప్యూర్టోరీకో కన్నా అమెరికా మెయిన్‌ల్యాండ్‌పై నివసించేవారే ఎక్కువ. ఈ దీవికి చెందినవారు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఓటర్లుగా నివసిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఈ కమ్యూనిటీ క్రియాశీల ఓటర్లుగా ఉన్నారు. న్యూయార్క్‌లో ఆదివారం జరిగిన సభలో ట్రంప్, ఆయన భార్య మెలానియాతో పాటు స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారు.
వీరందరి ప్రసంగం ముగిశాక ప్రముఖ స్టాండప్ కమెడియన్ టోనీ హించ్‌క్లిఫ్ తన ప్రదర్శన చేశారు. సాధారణంగా ఆహూతులను నవ్వించాల్సిన టోనీ అందుకు భిన్నంగా ఆగ్రహ జ్వాలలు రగిల్చారు. సముద్రం మధ్యలో కదిలే చెత్త కుప్ప ఒకటి ఉంది. అది ప్యూర్టోరీకో అంటూ వ్యాఖ్యానించడమే వివాదానికి కారణమైంది.
ట్రంప్‌పై ప్రభావమెంత?
అమెరికా ఎన్నికల్లో తటస్థ రాష్ట్రాలు (స్వింగ్ స్టేట్స్) కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే రెండు ప్రధాన పార్టీలు ఈ రాష్ట్రాలపైనే ఎక్కువగా దృష్టి సారిస్తాయి. పెన్సిల్వేనియాలో 4.86 లక్షల మంది ఓటర్లు (రాష్ట్ర జనాభాలో 3.7 శాతం) ప్యూర్టోరీకన్ ఓటర్లు ఉన్నారు. అధ్యక్ష బరిలో గెలవాలంటే ఈ రాష్ట్రం ఎంతో కీలకం. గత ఎన్నికల్లో కేవలం 1.2 శాతం తేడా తో ట్రంప్‌పై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గెలుపొందారు.
తాజా వివాదంతో ఇక్కడ ట్రంప్ ఓటమి తప్పదనే వార్తలు వస్తున్నాయి. మరో స్వింగ్ స్టేట్ అయిన జార్జియా లోనూ 1.31 లక్షల మంది ప్యూర్టోరీకన్ ఓటర్లు ఉన్నా రు. ప్రస్తుత పోల్ సర్వేల్లో పెన్సిల్వేనియా డెమోక్రాట్ అభ్యర్థి కమల హ్యారిస్ ఆధిక్యంలో ఉండగా జార్జియాలో ట్రంప్ హవా కొనసాగుతోంది.
కానీ, ఇప్పుడు జార్జియాలోనూ ట్రంప్ వెనకపడే అవకాశమున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. స్వింగ్ స్టేట్స్, ఇతర రాష్ట్రాల్లో వీరి జనాభా అధికంగానే ఉంది. ఫ్లోరిడాలో 12 లక్షల మంది, కనెక్టికల్‌లో 3 లక్షల మంది, మసాచుసెట్స్‌లో 3.26 లక్షల మంది, న్యూయార్క్‌లో 10 లక్షల మంది ప్యూర్టోరీకన్ ఓటర్లు ఉన్నారు. దీంతో ట్రంప్ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది.
గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే..
ట్రంప్ కూడా గతంలో జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. 2018లో ఎల్‌సాల్వెడార్, హైతీ, ఆఫ్రికాలోని దేశాలను కించపరుస్తూ ట్రంప్ మాట్లాడారు. కొన్ని రోజుల కింద వలసలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వ్యర్థాలు అన్నీ అమెరికాకే వస్తున్నాయి. అమెరికా ఏమన్నా చెత్తకుప్పనా? నేను మళ్లీ అధికారంలోకి వస్తే ఎప్పుడూ లేని విధంగా అక్రమ వలసలను నిర్మూలిస్తా అని వ్యాఖ్యానించారు.
వీటితో పాటు తాజాగా హించ్‌క్లిఫ్ చేసిన వ్యాఖ్యలతో సెలబ్రిటీలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యూర్టోరీకో మూలాలున్న పాప్ సింగర్స్ జెన్నీఫర్ లోపెజ్, రికీ మార్టిన్, బ్యాడ్ బన్నీ సహా పలువురు హించ్‌క్లిఫ్‌పై మండిపడుతున్నారు. ఈ వివాదం పై కమల స్పందిస్తూ ట్రంప్ సంగతి తెలిసిందే. ఆయన గెలిస్తే ప్రజల మధ్య విభజన తెస్తారని మరోసారి నిరూపించుకున్నారు అని విమర్శించారు.