చేవెళ్ల, సెప్టెంబర్ 10: బస్సు ఎక్కే క్రమంలో ఓ మహిళ దగ్గర ఉన్న కవర్‌ను కత్తిరించిన దుండగులు అందులోని రూ.45 వేలు దొంగిలించారు. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. శాబాద్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన కావలి సావిత్రి.. తన బంధువు మాధవితో కలిసి మంగళవారం చేవెళ్లలోని గోల్కొండ బ్యాంకులో రూ.51వేలు డిపాజిట్ చేసేందుకు వచ్చింది. అయితే ఆమె వద్ద రూ.45 వేలు మాత్రమే ఉండటంతో మిగితా డబ్బుల కోసం గోల్డ్‌లోన్ తీసుకోవాలనుకుంది. ఆ సమయంలో బ్యాంక్‌లో గోల్డ్‌స్మిత్ అందుబాటులో లేకపోవడం తో డబ్బులు డిపాజిట్ చేయకుండానే తిరిగి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిన తర్వాత ఆమె కవర్‌లో ఉంచిన రూ.45 వేలు కనిపించలేదు. ఈమేరకు చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో ఆమో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.