calender_icon.png 8 January, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.5 వేల పెన్షన్.. సూపర్ రిచ్‌పై పన్ను

07-01-2025 01:06:13 AM

ట్రేడ్ యూనియన్ల బడ్జెట్ డిమాండ్లు

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ఓ పెన్షన్‌ను కనీసం రూ.5 వేలు చేయాలని ట్రేడ్ యూనియన్లు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. సత్వరమే 8వ పేకమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరాయి. 2025 బడ్జెట్‌లో సూపర్ రిచ్‌పై పన్నులు వేయాలని సూచించాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిగిన బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ట్రేడ్ యూనియన్స్ ప్రతినిధులు కేంద్రం ముందు పలు డిమాండ్లు ఉంచారు.

ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 వేలు చేయాలని ట్రేడ్ యూనియన్లు కేంద్రాన్ని కోరాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరాయి. గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. సమావేశం అనంతరం యూనియన్ ప్రతినిధులు ఇదే విషయమై మీడియాతో మాట్లాడారు. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణను ఆపాలని కేంద్రాన్ని కోరినట్లు టీయూసీసీ జాతీయ కార్యదర్శి ఎస్‌పీ తివారీ చెప్పారు.

ఈ సారి బడ్జెట్‌లో సూపర్ రిచ్‌పై 2 శాతం అదనంగా పన్ను వేసి అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ఆ మొత్తాన్ని వినియోగించాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు సైతం సామాజిక భద్రత కల్పించాలని, వారికి సైతం కనీస వేతనాలు కల్పించాలన్నారు. కాగా, ఈపీఎఫ్95 పెన్షన్ కింద ప్రస్తుతం లభిస్తున్న కనీస పెన్షన్‌ను రూ.1000నుంచి రూ.5 వేలకు పెంచాలని భారతీయ మజ్దూర్ సంఘ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ (నార్త్ జోన్) పవన్ కుమార్ కోరారు.

దాన్ని వీడీఏకు అనుసంధానం చేయాలని కోరారు.రూ.10 లక్షల వరకు ఆదాయం పన్నును మినహాయించడంతో పాటుగా పెన్షన్ మొత్తంపై పూర్తిగా ఆదాయం పన్నును తొలగించాలని కోరారు. ఏడవ వేతన సంఘం ఏర్పాటు చేసి పదేళ్లు దాటి పోయిందని, 8 వ వేతన సంఘాన్ని సత్వరమే ఏర్పాటు చేయాలని సీఐటీయూ జాతీయ కార్యదర్శి  స్వదేశ్ దేవ్ రాయ్ పేర్కొన్నారు. 1980లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 21 లక్షలుండగా 202324 నాటికి అది 8 లక్షలకు చేరడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.