calender_icon.png 24 October, 2024 | 10:02 AM

భూమిలేని నిరుపేదల ఖాతాల్లో 12 వేలు

18-09-2024 01:14:59 AM

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం  

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు 

రైతులకు సోలార్ పంపు సెట్లు.. పైలట్ ప్రాజెక్టుగా సిరిపురం  

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

ఖమ్మం జిల్లాలో దళితబంధు మంజూరు పత్రాల పంపిణీ  

ఖమ్మం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ ఏడాదే భూమిలేని నిరుపేదలకు  నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12 వేలను జమచేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో 847 దళిత కుటుంబాలకు 15.౫౪ కోట్ల విలువైన మంజూరు పత్రాలను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌తో కలిసి భట్టి లబ్ధిదారుల కు అందజేశారు.

ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అందులో భాగం గా భూమి లేని నిరుపేద కూలీలకు ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు ఈ సంవత్సరం నుంచే వారి ఖాతాల్లో రూ.12 వేలు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ సిద్ధమవుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా త్వరలోనే అమలు చేయబోతున్నామని స్పష్టంచేశారు. ఈ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందించ బోతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా  చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.౨ లక్షల రుణాలను మాఫీ చేశామని, జిల్లాలో 1,15, 180 మంది రైతులకు రూ.766.66 కోట్లకు పైగా రుణమాఫీ చేశామని వివరించారు. అర్హులైన ప్రతిరైతుకు రుణమాఫీ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పా రు. రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులకు వర్తింపజేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  పునరుద్ఘాటించారు. 

సోలార్ రూఫ్‌తో సౌర విద్యుత్ ఉత్పత్తి 

గృహజ్యోతి పథకం కింద 200 యూని ట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వడంతోపాటు కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ రూఫ్ ద్వారా సౌర విద్యుదుత్పత్తి చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని భట్టి తెలిపారు. దీనిద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌లో గృహ యజమాని వినియోగానికి పోను మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి, డబ్బులను అందజేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పీ శ్రీజ, శిక్షణ సహా య కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ట , జిల్లా అటవీ అధికారి సిద్ధార్ద్ విక్రమ్‌సింగ్, డీఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో గణేశ్ పాల్గొన్నారు. 

రైతులకు సోలార్ పంపు సెట్లు 

రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సోలార్ వ్యవసాయ పంపు సెట్లు తీసుకువస్తున్నామని, సోలార్  వ్యవసా య  పంపు సెట్ల  ద్వారా మిగిలిన కరెంట్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతు లకు  అదనపు ఆదాయం  కల్పిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.  ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ని సిరిపురం గ్రామాన్ని సోలార్ వ్యవసాయ పంపు సెట్ల ఏర్పాటుకు పైలెట్  ప్రాజెక్టుగా  ఎంపిక చేశామని వెల్లడించారు. ఈ గ్రామంలోని ప్రతి రైతుకు పూర్తి ప్రభుత్వ ఖర్చుతో సోలార్ వ్యవసాయ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సోలార్ విద్యుదుత్పత్తిలో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములను చేసేవిధంగా ప్రభు త్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు చర్య లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి, మహిళలకు ఆదాయం సమకూరుస్తుందని తెలిపారు. సేంద్రియ  సాగును ప్రోత్సహించడంలో భాగంగా చింతకాని మండలానికి పెద్దపీట వేస్తామని, సేంద్రి య వ్యవసాయ సాగు ద్వారా చేసే ఉత్పత్తులను  మార్కెటింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపించి, కొనుగోలు వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. తనను గెలిపించిన  మధి ర ప్రజలు తలెత్తుకునే విధంగా పాలన అందిస్తామని అన్నారు. 

ఈ ఏడాది నుంచే పంటల బీమా పథకం 

పంటల బీమా పథకాన్ని ఈ సంవత్సరం నుంచే  వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. రైతు చెల్లించాల్సిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టంచేశారు. సన్న వడ్లకు మాత్రమే ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లించాలని నిర్ణయించిందని,  దళిత బంధు పథకాన్ని వినియోగించుకుని లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ప్రజాపాలన దినోత్స వాన్ని వ్యతిరేకించిన వారు రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టేనని అన్నారు. చింతకాని మండలంలో దళిత బంధు పథకం మంజూరులో భాగంగా  3,462 కుటుంబాలను ఎంపిక చేశామని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. దళితబంధు యూనిట్స్‌ను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీలు లేదని, బెదిరించి తీసుకెళ్లడం నేరమని, లబ్ధిదారులను బెదిరించి తీసుకువెళ్లిన యూనిట్స్‌ను తిరిగి తీసుకువచ్చి అప్పగించాల్సిన బాధ్యత ప్రత్యేక అధికారులు, జిల్లా యంత్రాంగం తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి పెనుభారమైన.. ఆనాటి పాలన పరిస్థితులను సరిచేసి ఆర్థిక వ్యవస్థను గాడి లో పెట్టి ఒకటో తేదీన ఉద్యోగులకు వేతనా లు ఇస్తున్నామని స్పష్టంచేశారు. 

గత ప్రభుత్వం నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన హాస్పిటల్స్ మందుల బిల్లులు, కల్యాణలక్ష్మి, మధ్యాహ్న భోజనం, కార్మికుల గౌరవ వేతనం, హాస్టల్  మెస్ బిల్లుల బకాయిలను ప్రజాప్రభుత్వం క్లియర్ చేసిందని స్పష్టంచేశారు.