ఉద్యోగి ఖాతా నుంచి 40 వేలు డ్రా
జగిత్యాల, ఆగస్టు 7 (విజయక్రాంతి): వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను బాధితుడు ఓపెన్ చేయగా సైబర్ నేరగాళ్లు రూ.40 కాజేశారు. ఈ ఘటన జగిత్యాలలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండల ఎంపీడీవో కార్యాలయంలో ర్యాగల శివప్రసాద్ టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిరహిస్తున్నాడు. ఇటీవల అతడి వాట్సాప్‌కు బ్యాంక్ పేరుతో ఓ లింక్ వచ్చింది. తన ఖాతా ఉన్న బ్యాంక్ నుంచే లింక్ వచ్చిందనుకున్న శివప్రసాద్ లింక్ తెరిచాడు. అక్కడి చూపిన ఆప్షన్ల ప్రకారం వివరాలు నమోదు చేశాడు. అంతే.. అరగంటలో సైబర్ నేరగాళ్లు రూ.40 వేలు కొల్లగొట్టారు. కాసేపటి తర్వాత తన మొబైల్‌కు బ్యాంక్ ఖాతా నుంచి నగదు డ్రా అయినట్లు చూసుకుని బాధితుడు 1930 కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. అనంతరం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.