calender_icon.png 25 September, 2024 | 8:09 AM

16 వేల డబుల్ బెడ్‌రూం ఇండ్లు

25-09-2024 04:33:53 AM

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 

ఓఆర్‌ఆర్ పరిధిలో చెరువులు, కుంటలకు 

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి 

కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలి 

దసరా కల్లా మెట్రో విస్తరణ డీపీఆర్ సిద్ధం చేయాలి 

ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గంపై నివేదిక అందజేయాలి

గ్రేటర్ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష 

ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఇప్పటివరకు 10,200 మంది నిర్వాసితులను గుర్తించిన ప్రభుత్వం 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మూసీ నిర్వాసితులకు డబుల్ బెబ్‌రూం ఇండ్లను కేటాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు నగరంలో 16వేల డబుల్ ఇండ్లను కేటాయిస్తునట్లు ప్రభుత్వం జీవోలో స్పష్టంచేసింది.

మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్‌లో ఉన్న నిర్మాణదారులకు పునరావాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మంది నిర్వాసితులున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని నిర్వాసితులకు ఏ ప్రాంతంలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించారు అనే విషయాన్ని జిల్లా కలెక్టర్లు స్వయంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి తెలియజేస్తారని ఉత్తర్వులలో ప్రభుత్వం పేర్కొంది.

మొదటగా రివర్ బెడ్‌లో ఉన్న 1600 మంది లబ్ధిదారుల ఇళ్లను తొలగించి అక్కడ ఉన్నవారిని తరలిస్తారని, అలాగే మూసీ బఫర్ జోన్‌లో నివసిస్తున్న వ్యక్తుల నిర్మాణాలకు చట్ట ప్రకారం పరిహారం చెల్లిస్తారని తెలిపారు. నిర్మాణ ఖర్చుతోపాటు వారికి పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా చెల్లించి డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించనున్నారు.

అలాగే ప్రభుత్వం మూసీ బాధిత ప్రజలందరికీ చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే భరోసా ఇచ్చారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో కలిసి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. మూసీ నిర్వాసితులకు నేటి నుంచి జిల్లా కలెక్టర్లు పునరావాసం కల్పిస్తారని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. 

ఓఆర్‌ఆర్ పరిధిలో చెరువులు, కుంటలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి 

  1. దసరా కల్లా మెట్రో విస్తరణ డీపీఆర్ సిద్ధం చేయాలి 
  2. ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గంపై నివేదిక  అందజేయాలి
  3. గ్రేటర్ అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష 

హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతంతోపాటు చెరువులు, నాలాల ఏరియాల్లో నివసించే అర్హులైన పేదల వివరాల ను సేకరించి, డబుల్ బెడ్‌రూం ఇండ్లను కేటాయించాలని, లేదంటే ప్రత్యామ్నాయం చూపించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

నగరంలోని చెరువులు, నాలాలు, కుంటల పరిరక్షణ చర్యల్లో భాగం గా వాటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధా నం చేయాలని సూచించారు. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులతో జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.

  హైదరాబాద్ నగరంలో ఆక్రమి త చెరువులు, నాలాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఔటర్‌రింగ్ రోడ్డు పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని సీఎం సూచించారు.

ఇకపై చెరువులు, నాలా లు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణ మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంట లు, నాలాలు అన్నింటినీ గుర్తించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలన్నారు. హైదరాబాద్ సిటీలోని ఔటర్‌రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాలు సేకరించాలన్నారు.

వీటికి సంబంధిం చిన పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలన్నారు. అదే సమయంలో అర్హులైన పేదలకు నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని సీఎం ఆదేశించారు.

ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలన్నారు. దసరాలోగా మెట్రో విస్తరణ రూట్‌కు సంబంధించి పూర్తిస్థాయి డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని సీఎం ఆదేశించారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకులు ఉంటే తక్షణమే వాటిపై దృష్టి సారించి పరిష్కరించాలని అన్నారు.

ఎల్‌బీనగర్  హయత్ నగర్, ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్టతోపాటు మెట్రో విస్తరణకు సంబంధించిన అంశాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. సమావేశంలో ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం. దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, సలహాదారులు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.