calender_icon.png 16 November, 2024 | 11:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

5 వేల సైబర్ కమాండోస్

11-09-2024 12:10:14 AM

  1. సైబర్ నేరాల కట్టడికి నేషనల్ రిజిస్ట్రీ
  2. సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ ఏర్పాటు
  3. హైదరాబాద్, విశాఖ సైబర్ టీమ్‌లు భేష్
  4. సైబర్ సెక్యూరిటీ లేకుండా జాతీయ భద్రత అసాధ్యం
  5. కేంద్ర హోమంత్రి అమిత్ షా ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: సైబర్ సెక్యూరిటీ లేకుండా జాతీయ భద్రత అసాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నట్టు ప్రకటించారు. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ మొదటి వ్యవస్థాపక దినోత్సరం సందర్భంగా ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ దాడులను అరికట్టేందుకు 5000 మంది సైబర్ కమాండోలను నియమించనున్నట్టు ప్రకటించారు.

సైబర్ నేరగాళ్లను తేలిగ్గా గుర్తించేందుకు, రాష్ట్రాల మధ్య నేరగాళ్ల వివరాలు వేగంగా పంచుకొనేందుకు నేషనల్ రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ (సీఎఫ్‌ఎంసీ)ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందులో  బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీలు, పేమెంట్ అగ్రగేటర్లు, టెలికం సర్వీస్ ఆపరేటర్లు, ఐటీ ఇంటర్మీడియరీలు, దర్యాప్తు సంస్థల అధికారులు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు. ఆర్థిక నేరాల కట్టడికి ఈ విభాగాల అధికారులంతా కలిసి పనిచేస్తారని వివరించారు. దేశంలోని హైదరాబాద్, విశాఖపట్నం, మేవాత్, జమ్‌తారా, అహ్మదాబాద్, చండీగఢ్ జాయింటఠ్ సైబర్ కో ఆర్డినేషన్ టీమ్‌లు అద్భుతంగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. 

సీబీఐ తరహాలో సైబర్ కమాండోస్

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీబీఐ తరహాలో సైబర్ కమాండోస్ వ్యవస్థను ఏర్పాటుచేయనున్నట్టు అమిత్ షా ప్రకటించారు. వీరికి సైబర్ నేరాల కట్టడిలో శిక్షణ ఇస్తామని చెప్పారు. వీరు రాష్ట్రాలకు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు సైబర్ నేరాల కట్టడిలో సహకారం అందిస్తారని వెల్లడించారు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) ఆధారంగా నేషనల్ రిజిస్ట్రీని కూడా ఏర్పాటు చేస్తారు. ఇందులో దేశంలోని సైబర్ నేరగాళ్ల వివరాలన్నీ ఉంటాయి. ప్రపంచ డిజిటల్ ఆర్థిక లావాదేవీల్లో 46 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. 2014 మార్చి 31 నాటికి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 25 కోట్ల మంది ఉండగా, 2024 మార్చి 31 నాటికి 95 కోట్లకు పెరిగారు. ఇంటర్నెట్ డాటా వినియోగం కూడా 78 శాతం పెరిగిందని అమిత్ షా వెల్లడించారు.