calender_icon.png 25 March, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల సంక్షేమానికి 20వేల కోట్లు ఇవ్వాలి

22-03-2025 01:23:37 AM

  • ఈమేరకు రాష్ట్ర బడ్జెట్‌ను సవరించాలి 

బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలి

సీఎంకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ

హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): బీసీ సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.11వేల కోట్లు మాత్రమే కేటాయించారని, దీనిని సవరించి రూ.20వేల కోట్లకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఎంకు లేఖ రాశారు.

ప్రస్తుతం కేటాయించిన నిధులు రాష్ట్రంలో 56శాతానికి పైగా ఉన్న బీసీలకు ఏ మూలకూ సరిపోవన్నారు. రూ.3లక్షల కోట్ల బడ్జెట్‌లో బీసీలకు కేవలం రూ.11వేల కోట్లు చాలా తక్కువన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు లేక విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇస్తూ కేవలం బీసీ విద్యార్థులకు మాత్రమే అన్యాయం చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలోని 320 బీసీ కాలేజీ హాస్టళ్లకు, 315 బీసీ గురుకులాలకు ఒక్కదానికి కూడా సొంత భవనం లేదన్నారు. కేటాయించిన స్థలాలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని తెలిపారు. బీసీ కార్పొరేషన్‌కు, 12 బీసీ కులాల ఫెడరేషన్‌లకు కేటాయించిన బడ్జెట్ ఏ మూలకు సరిపోదని, దాదాపు 8 లక్షల మంది బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు. వీరి సబ్సిడీ రుణాలకే రూ.6వేల కోట్లు కావాలన్నారు.