- తక్షణ సాయం కింద 2 వేల కోట్లు కావాలి
- జాతీయ విపత్తుగా ప్రకటించాలి
రాష్ర్టంలో భారీ వరదలపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ
ఖమ్మంలో వరద ప్రాంతాలు సందర్శన
బాధితులను ఆదుకుంటామని భరోసా
మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం
పంటనష్టం కింద ఎకరానికి 1౦ వేల తక్షణ సాయం
పశువులకు రూ.౫౦వేలు.. జీవాలకు 5 వేలు
ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట,
కొత్తగూడెం కలెక్టర్లకు ఐదేసి కోట్లు
హైదరాబాద్‌లో కూలీలకు నిత్యావసరాలు
వరద సమయంలో బురద రాజకీయాలు తగవు
హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం సమీక్షల్లో సీఎం
విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ ౨: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రూ.2 వేల కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణ సాయంగా రూ.౨ వేల కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో వరదల పరిస్థితిపై సోమవారం ఉదయం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.
వరదలకు తీవ్రంగా దెబ్బతిన్న ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చారు. మార్గమధ్యలో సూర్యాపేటలో ఆగి ఆ జిల్లాలో వరద పరిస్థితిపై సమీక్షించారు. ఖమ్మం వరద ప్రాంతాల్లో పర్యటన అనంతరం రాత్రి ఖమ్మం జిలా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించి నష్టంపై ఆరా తీశారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల జన జీవనం అతలాకుతలమైందని, ప్రజలు సర్వం కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎటువంటి భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సాయం కోరామని చెప్పారు. వర్షాల వల్ల రూ.5,438 కోట్ల నష్టం జరిగిందని ఇప్పటివరకు అంచనా వేసినట్టు వెల్లడించారు. ౫ లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 16 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వం వారందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద ముప్పుపై తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించామని వెల్లడించారు. వరద విపత్తును పరిశీలించేందుకు తెలంగాణలో పర్యటించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
విపక్షం బాధ్యతారాహిత్యం
ప్రజలు కష్టాల్లో ఉంటే విపక్ష బీఆర్‌ఎస్ నేతలు కనీసం పట్టించుకోవటంలేదని సీఎం విమర్శించారు. ‘మేము రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారు. కేటీఆర్ అమెరికాలో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పని చేయడం లేదని విమర్శిస్తున్నారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎందుకు అడగడం లేదు? వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజలకు చిల్లిగవ్వ కూడా ఇవ్వదు.
కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ.లక్షల కోట్ల సొమ్ములో వెయ్యి కోట్లో.. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా?’ అని ప్రశ్నించారు. ‘అమెరికాలో ఉన్న ఒకాయన ట్విట్టర్‌లో పోస్ట్‌లు పెట్టుడు, మరొకాయన ఫామ్ హౌజ్ నుంచి బయటకు రాకపోవుడు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలతో ధిల్లీ వెళ్తారు కానీ.. వరద బాదితులను మాత్రం పరామర్శించరు’ అని బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
వరద ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తుందని సీఎం ప్రకటించారు. గతంలో ఇలాంటి ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు రూ.౪ లక్షలు ఇచ్చేవారు. పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని సీఎం చెప్పారు. నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.10 వేలు అందిస్తామని తెలిపారు. పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ. 50 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
మేకలు, గొర్రెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతూ పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వరదలపై గత ప్రభుత్వం కనీసం ఓ విధానమంటూ రూపొందించలేదని విమర్శించారు. వరద సహాయ చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలీసులు కూడా బాధితులకు సాయం చేయాలని కోరారు. వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
పంట నష్టం తక్షణ సర్వే
భారీ వర్షాలతో వరదల కారణంగా జరిగిన పంట నష్టంపై తక్షణం సర్వే చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో వరదలు వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం వెంటనే విడుదల చేశామని, ప్రస్తుతం అలా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పంట నష్టం వివరాలను సమగ్రంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ బృందాలు కూడా తక్షణమే పంట నష్టం పరిశీలనకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.