- ఈనెల 26 నుంచి నాలుగు పథకాలు అమలు చేస్తాం
- ప్రతి అర్హుడికి లబ్ధి చేకూరుస్తాం
- మాట ప్రకారం రైతు రుణమాఫీ
- గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలతో ప్లెక్సీలు: డిప్యూటీ సీఎం భట్టి
- ఖమ్మంలో మంత్రులు పొంగులేటి, తుమ్మల,
- కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సమీక్ష
ఖమ్మం,జనవరి 13 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమ లు చేయనున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల జారీ పథకాల కోసం రూ.౪౫ వేల కోట్లకుపైగా ఖర్చుచేయనున్నదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్ర మార్క తెలిపారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధి చేకూర్చేందుకు పారదర్శకత పాటిస్తున్నామని స్పష్టంచేశారు.
నాలుగు కార్యక్రమాల అమలుపై సోమవారం ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఇంచా ర్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రు లు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితీశ్ వీ పాటిల్ లతో కలిసి డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల నిర్మాణం, మెస్ ఛార్జీలు 40 శాతం పెంపు, కాస్మోటిక్ చార్జీల పెంపు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఉద్ఘాటించారు. సన్నరకం ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించామని స్పష్టంచేశారు.
26న 4 కొత్త పథకాలకు శ్రీకారం
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్‌కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను గణతంత్ర దినోత్సవం నుంచి అమలు చేయాలని నిర్ణయించిందని భట్టి వెల్లడించారు. ఈ పథకాల అమలుకు ప్రభుత్వం రూ.45 వేల కోట్లకు పైగా ఖర్చు చేయబోతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లకు రూ.22,500 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డుల జారీ కోసం అదనంగా ఖర్చుచేయాల్సి ఉన్నదనీ.. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేస్తున్నామని స్పష్టంచేశారు. ప్రతి పథకంపై సంపూర్ణంగా చర్చించి, మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు.
సాగు భూములకే రైతు భరోసా
వ్యవసాయ యోగ్యమైన భూమి ప్రతి ఎకరాకు రైతు భరోసా సాయం రూ.12 వేలు అందిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండి భూమి లేని వ్యవసాయ కుటుంబాలు 20 రోజులు ఉపాధి పని చేస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలవుతుందని చెప్పారు. ఎంత మంది రైతులకు ఎంత రుణమాఫీ జరిగింది.. ఎంత మంది రైతు భరోసా వస్తుంది.. బోనస్ వచ్చిన రైతుల వివరాలను తెలియజేస్తూ గ్రామాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు.
పథకాలు అనర్హులకు అందకూడదు : మంత్రి కోమటిరెడ్డి
ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పలు గ్యారెంటీల పథకాలను అమలు చేశామని ఖమ్మం మంత్రి కోమటిరెడి వెంకట్‌రెడ్డి తెలిపారు. పేదలకు అత్యంత చేరువయ్యే రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్‌కార్డుల జారీ పకడ్బందీగా చేపడతామని చెప్పారు. అర్హులకు పథకాలు చేరడం ఎంత ముఖ్యమో.. అనర్హులకు అందకుండా చూడటం కూడా కీలకమని పేర్కొన్నారు.
గత పాలకుల హయాంలో రేషన్‌కార్డులు అందలేదని, అర్హులందరికీ ప్రస్తుతం రేషన్‌కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే 10 రోజులు అధికారులు కష్టపడి గ్రామాల్లో తిరిగి అర్హులను ఎంపిక చేయాలని, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా పక్కాగా కార్యక్రమాలు అమలుచేయాలని ఆదేశించారు.
రేషన్ కార్డుల జారీలో మానవీయంగా ఉండాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నూతన రేషన్‌కార్డుల జారీ అంశంలో అధికారులు మానవీయ కోణంలో పని చేయాలని మంత్రి ఉత్తకుమార్‌రెడ్డి సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ అంశాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించాలని సూచించారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ నాయకత్వంలో ఆహారభద్రత చట్టాన్ని ప్రవేశపెట్టామని, నూతన రేషన్ కార్డుల జారీ, కార్డుల్లో నూతన సభ్యుల నమోదు వివరాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇస్తామని అన్నారు. ఏటా సన్న బియ్యం మీద రూ.11 కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు.
మార్గదర్శకాలనుగుణంగా రైతు భరోసా : మంత్రి తుమ్మల
అధికారులు అప్రమత్తంగా ఉంటూ వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఎక్కడా పెట్టుబడి సాయం చేరకుండా జాగ్రత్త పడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి అర్హుడికి సహాయం అందేలా చూడాలని చెప్పారు. లేఔట్, నాలా, భూసేకరణ, పరిశ్రమలు, మైనింగ్ భూముల సంబంధిత శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామ శాటిలైట్ మ్యాప్ వాడుతూ పారదర్శకంగా అర్హులను ఎంపిక ఉండాలని సూచించారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పంట వేసినా, వేయకపోయినా రైతు భరోసా అందుతుందని చెప్పారు.
పారదర్శకంగా అర్హుల ఎంపిక: మంత్రి పొంగులేటి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాలుగు పథకాలను ప్రభుత్వం అమలు చేయబోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాలు క్యాబినెట్ ఆమోదించిందని చెప్పారు. ప్రభుత్వ ఆలోచనలను అధికారులు పక్కాగా అమలు చేయాలని, ఎక్కడా ఎటువంటి తప్పు జరగడానికి వీలులేదని స్పష్టంచేశారు.
అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ప్రతి గ్రామ సభలో ఈ పథకాలు నిరంతర ప్రక్రియ అని చెప్పాలని కోరారు. పథకాల డైడ్‌లైన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పేదలకు కులమతాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పథకాల అమలుకు డాటా కీలకం: ఎంపీ రఘురామరెడ్డి
ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు చేసేందుకు డాటా చాలా కీలకమని, అధికారులు వివరాలు సరిగ్గా నమోదు చేస్తేనే అర్హులకు ఫలితాలు అందుతాయని ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి అన్నారు. మహబూబాబాద్ ఎంపి పోరిక బాలరాంనాయక్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన, ఇతరులకు బ్యాంకులలో రుణాలు కూడా అందడం లేదని, దీనిని పరిష్కరించాలని కోరారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్, ఆదినారాయణ, రాందాస్‌నాయక్, మట్టా రాగమయి దయానంద్, ఐటీడీఏ పీవో రాహుల్, అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ, ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తదితరులు పాల్గొన్నారు.