- 36 ఔషధాలకు పన్ను తొలగింపు
- ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఫోకస్
- మెడికల్ టూరిజంపై దృష్టి
- దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు
- ఇదే ఆర్థిక సంవత్సరంలో 200 కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలు
- వైద్య విద్యకు భారీ ఊతం
- పెరగనున్న మెడికల్ సీట్లు
- గిగ్ వర్కర్లకు కూడా ఆరోగ్య బీమా
- గతేడాదితో పోల్చుకుంటే పెరిగిన కేటాయింపులు
- రూ. 8899.93 కోట్లు అధికం
- పదేండ్లలో 191 శాతం పెరిగిన కేటాయింపులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ. 99,858.63 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. గతేడాదితో పోల్చుకుంటే 9.8 శాతం మేర కేటాయింపులు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 90,958.63 కోట్లు మాత్రమే కేటాయించగా..
ఈ సారి మాత్రం ఎక్కువ కేటాయింపులు జరిపారు. ఫార్మా ఇండస్ట్రీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్షియేటివ్ (పీఎల్‌ఐ) కొరకు రూ. 2,445 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్‌లో రూ. 95,957.56 కోట్లను ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం కేటాయించగా.. మరో రూ. 3,900.69 కోట్లను హెల్త్ అండ్ రీసెర్చ్ కోసం కేటాయించారు.
191 శాతం అధికం
ఆరోగ్య రంగానికి గత కొద్ది రోజుల నుంచి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వస్తోంది. ఈ రంగానికి 2014-15 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 34,286 కోట్ల మేర కేటాయింపులు జరగ్గా.. ఈ ఏడాది మాత్రం రూ. 99,858.56 కోట్ల మేర కేటాయింపులు జరగడం గమనార్హం.
ఈ కేటాయింపులే మోదీ ప్రభుత్వం వైద్యరంగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందనేది తెలియజేస్తున్నాయి. “ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై)”కి రూ. 9,406 కోట్లు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (పీఎంబీహెచ్‌ఐఎం)”కు రూ. 4,200 కోట్ల కేటాయింపులు జరిపారు.
“నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం)”కు రూ. 37.226.92 కోట్లు, “ద నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం”కు రూ. 79.6 కోట్లు, “ద నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్”కు రూ. 340.11 కోట్లు కేటాయించారు. స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలకు రూ. 20,046.07 కోట్లు “ఎయిమ్స్” ఢిల్లీ రూ. 5,200 కోట్ల మేర కేటాయింపులు పెరిగాయి.
200 డేకేర్ క్యాన్సర్ సెంటర్లు
2025 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 200 డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. రాబోయే మూడేండ్లలో జిల్లా కేంద్రాల్లోని అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.
వచ్చే ఏడాది 10వేల అదనపు మెడికల్ సీట్లు అలాగే వచ్చే ఐదేండ్లలో 75వేల అదనపు సీట్లు కల్పించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగ బడ్జెట్ అనేది చాలా కీలకం. ఈ బడ్జెట్ ఆరోగ్య రంగంపై విస్తృత దృష్టి సారించింది అని మంత్రి పేర్కొన్నారు.
* క్యాన్సర్ సహా దీర్ఘకాలిక, అరుదైన వ్యాధులకు సంబంధించిన 36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని అలాగే మరో ఆరు ఔషధాలపై కన్సెషనల్ కస్టమ్స్ డ్యూటీని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
* పేషంట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్స్ కింద ఫార్మా కంపెనీలు ఉచితంగా అందించే ఔషధాల జాబితాలోకి మరో 37 మందులను చేర్చారు.
* గిగ్ వర్కర్ల కోసం వారికి ఐడీ కార్డులు జారీ చేయనున్నారు. వారందరినీ ఈ-శ్రమ్ పోర్టల్‌లో అనుమతించనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కూడా కల్పించనున్నారు.
మెడికల్ టూరిజం కేంద్రంగా భారత్
‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా భారత్‌ను గ్లోబల్ మెడికల్ టూరిజం కేంద్రంగా మార్చే దిశగా ఈ బడ్జెట్ కీలక అడుగులు వేసింది. మెడికల్ టూరిజాన్ని పెంపొందించేందుకు వీసా సౌలభ్యాలు, విదేశీయులు ఇక్కడికి వచ్చి సులభంగా వైద్యం చేయించుకునే సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల వైద్య రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి.
డా.గాయత్రి కామినేని, సీఓఓ, కామినేని హాస్పిటల్స్