విద్యుత్ శాఖలో కుంభకోణం
సర్కారుకు 8 వేల నుంచి 9 వేల కోట్ల నష్టం
- ప్రభుత్వ సొమ్మును మెక్కిన బీఆర్‌ఎస్ సర్కార్
- పవర్ కమిషన్ చైర్మన్‌ను నియమించి విచారణ
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
బీఆర్‌స్ పాలనలో విద్యుత్ శాఖలో రూ.8 నుంచి రూ.9 వేల కోట్ల కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో పద్దులపై సోమవారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం విద్యుత్ శాఖపై మాట్లాడారు. గత ప్రభుత్వం ఎక్కడ మెక్కిందో తమకు తెలుసని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడు అనేలా మాజీ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. నీతిపరులైతే కమిషన్ ముందు ఎందుకు విచారణకు హాజరుకావడంలేదని ప్రశ్నించారు. పవర్ ప్లాంట్లకు సంబంధించి ఎలక్ట్రో మెకానికల్, సివిల్ పనుల కాంట్రాక్టుల విషయంలో బీఆర్‌ఎస్‌వాళ్ల్లు అతి తెలివి ప్రదర్శించారని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు
ఇసుక, కంకర కాంట్రాక్టులన్నీ బినామీలకే
ఇండియా బుల్స్ నుంచి వెయ్యి కోట్లు లంచం
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ఎలక్ట్రో మెకానికల్ పనులను బీహెచ్‌ఈఎల్‌కు ఇచ్చామని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని, బీహెచ్‌ఈఎల్ సివిల్ పనులు చేయదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆ పనులన్నీ బీఆర్‌ఎస్ వాళ్ల బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇసుక, కంకర ఇలా అన్ని కాంట్రాక్టులు పార్టీ ఫిరాయించినోళ్లకు ఇచ్చారని విమర్శించారు. ఈ అవినీతి వల్ల గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖకు రూ.8 నుంచి రూ.9 వేల కోట్ల నష్టం వచ్చిదని తెలిపారు.
వారే విచారణను అడిగారు
ఛత్తీస్‌గఢ్, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఒప్పందాలపై బీఆర్‌ఎస్ నేతలే విచారణ కోరారని గుర్తుచేశారు. వారి కోరిక మేరకే విచారణ కమిషన్ నియమించామని తెలిపారు. కమిషన్ దగ్గరకు వచ్చి వివరాలు ఇవ్వాలని కోరితే కమిషన్‌పైనే ఆరోపణలు చేశారని మండిపడ్డారు. విచారణ కమిషన్ ముందు వాదన వినిపించకుండా కమిషన్ వద్దని కోర్టుకు వెళ్లారని తెలిపారు. విచారణ తప్పని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదని, విచారణను కొనసాగించాల్సిందేనని చెప్పిందని పేర్కొన్నారు. కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమించాలని మాత్రమే చెప్పిందని తెలిపారు.
విచారణలో బయటపడుతుందనే..
విచారణలో అక్రమాలు బయటపడుతాయన్న భయంతోనే ప్రజలను బీఆర్‌ఎస్ నేతలు తప్పుదారి పట్టించాలని చూస్తున్నదని సీఎం వివర్శించారు. ఆనాడు కేసీఆర్ ఎలా సభను తప్పుదోవ పట్టించారో 2015 రికార్డులు తీయాలని స్పీకర్‌ను కోరారు. నాడు తాను సభలో విభజనపై మాట్లాడితే నన్ను సభ నుంచి మార్షల్స్‌తో బయటకు పంపించారని తెలిపారు. వీళ్ల ఏలుబడిలో సోలార్ పవర్ ఒక మెగావాట్ మాత్రమే ఉత్పత్తి చేశారని తెలిపారు. గంపగుత్తగా బీహెచ్‌ఈఎల్‌కు సివిల్ పనుల కాంట్రాక్టు అప్పగించారని, ఆ సంస్థ నుంచి తిరిగి బీఆర్‌ఎస్ నేతల బినామీలు, బంధువులు, అనుయాయులకు సబ్ కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో వేలకోట్ల అక్రమాలు జరిగాయని విమర్శించారు. 18 శాతం లెస్‌కు పనులు చేసే అవకాశం ఉన్నా.. ప్రాజెక్టును నామినేషన్‌పై బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ చేసిందేమీలేదు
తెలంగాణకు బీఆర్‌ఎస్ నేతలు ఏదో కొత్త వెలుగులు తెచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిపై సీఎం మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాలతోనే హైదరాబాద్ నగరానికి నిరంతర విద్యుత్ వచ్చిందని అన్నారు. ఏ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తే సంబంధిత ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని చట్టం ఉందని చెప్పారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఉత్పత్తి ప్రాతిపదికన కాకుండా, వినియోగ ప్రాతిపదికన ఆస్తుల విభజన జరగాలని ఆ నాడు దివంగత జైపాల్‌రెడ్డి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్, సోనియాగాంధీని ఒప్పించారని తెలిపారు. అలా రాజ్యాంగంలో లేని ప్రత్యేక మినహాయింపు తెలంగాణకు ఇప్పించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే 53.46 శాతం తెలంగాణకు, 46.54 శాతం ఏపీకి విద్యుత్ పంపిణీ చేసేలా జైపాల్‌రెడ్డి కృషి చేశారని వెల్లడించారు. ఆయనే తెలంగాణలో చీకట్లు కమ్మకుండా, విద్యుత్ సంక్షోభం రాకుండా చేశారని తెలిపారు.
కమిషన్ చైర్మన్‌ను నియమిస్తాం
బీఆర్‌ఎస్ ఎమ్మేల్యేల కోరిక మేరకే విద్యుత్‌పై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. దొరికిపోయామని అర్ధమైంది కాబట్టే కమిషన్‌పై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలన్నది వాళ్లే.. సెగ తగలగానే వద్దన్నది వాళ్లేనని ఎద్దేవా చేశారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే లక్షణాలు తమకు లేవని, నమ్మిన వారిని మోసం చేసే గుణం బీఆర్‌ఎస్ నేతల డీఎన్‌ఏలోనే ఉందని ఆరోపించారు. సోమవారం సాయంత్రంలోపు విచారణ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని ప్రకటించారు.
సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తున్నారు
విచారణ కమిషన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. కమిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ వాళ్లు (బీఆర్‌ఎస్) కోర్టుకు వెళ్లారని, చైర్మన్ వైఖరిని కారణంగా చూపారని తెలిపారు. కమిషన్‌ను రద్దు చేయడం కుదరదని.. చైర్మన్‌పై అభ్యంతరం ఉంటే మార్చాలని కోర్టు స్పష్టంగా చెప్పిందని పేర్కొన్నారు. కోర్టు కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించిందని అన్నారు.
ప్రాజెక్టుల అంచనాలను పెంచారు
2015లో భద్రాద్రి పవర్ ప్రాజెక్టును రూ.7,290 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టారని, 2017లో పూర్తి చేస్తామని చెప్పి 2022లో పూర్తి చేశారని సీఎం తెలిపారు. ప్రాజెక్టు వ్యయం రూ.10,515 కోట్లకు పెంచారని ఆరోపించారు. భద్రాద్రి ద్వారా ఒక మెగావాట్ ఉత్పత్తికి రూ.9.73 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. రూ.25 వేల కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి ప్రాజెక్టు ప్రారంభించారని, 2020లోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి 2024 వచ్చినా పూర్తిచేయలేదని విమర్శించారు.
అంచనా వ్యయం మాత్రం రూ.34,548 కోట్లకు పెరిగిందని మండిపడ్డారు. ఇది భవిష్యత్‌లో రూ.40 వేల కోట్లకు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. దాదాపు రూ.10 వేల కోట్లు యాదాద్రి ప్రాజెక్టులో అంచనాలు పెంచారని, అవి ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు. ఎన్టీపీసీ ద్వారా పర్ మెగావాట్ ఉత్పత్తికి రూ.7.38 కోట్లు ఖర్చు అయితే, యాదాద్రి పవర్ ప్రాజెక్టు ద్వారా మెగావాట్ ఉత్పత్తికి రూ.8.64 కోట్లు అవుతోందని సీఎం తెలిపారు. 2015లో వాళ్లు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు 2023లో కేంద్రం తీసుకొచ్చిన నిబంధనను సాకుగా చెబుతున్నారని మండిపడ్డారు.
ఇండియా బుల్స్ నుంచి వెయ్యి కోట్లు మెక్కారు
భద్రాద్రి పవర్ ప్రాజెక్టు విషయంలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో గుజరాత్‌లోని ఇండియా బుల్స్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలని చట్టంలో ఉన్నా దాన్ని ఉల్లంఘించారని సీఎం ఆరోపించారు. ఇండియా బుల్స్ నుంచి రూ.వెయ్యి కోట్లు మెక్కి కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఉపయోగించారని విమర్శించారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టాల్సిన చోట కట్టలేదని, వీళ్ల నిర్వాకంతో 16 మంది అధికారులు విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర ఊడిగం
సభను, ప్రజలను తప్పుదోవ పట్టించాలని బీఆర్‌ఎస్ సభ్యులు చూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి రాష్ర్టంలో మంత్రి పదవుల కోసం వైఎస్, చంద్రబాబు దగ్గర బీఆర్‌ఎస్ నాయకులు ఊడిగం చేశారని విమర్శించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై, పాలమూరు వలసలపై ఆనాడు తాను అసెంబ్లీలో 53 నిమిషాలు మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణపై తాను అసెంబ్లీలో ఎంత మాట్లాడానో... కేసీఆర్ పార్లమెంట్‌లో ఎంత మాట్లాడారో రికార్డులు తీయాలని డిమాండ్ చేశారు. ఇతరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చింది బీఆర్‌ఎస్ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తాము జర్నలిస్ట్‌పై కేసు పెట్టామని చెబుతున్న వీళ్లు... వారి పాలనలో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఓ మహిళా జర్నలిస్టు ఛానల్‌ను గుంజుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ జర్నలిస్టులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆడబిడ్డలను జైల్లో పెట్టినందుకే ఇప్పుడు ఆ పాపం అనుభవిస్తున్నారని పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఆనాడు తనను జైల్లో పెట్టినా భయపడలేదని, అబద్ధాలు చెబితే నమ్మడానికి ప్రజలు అమాయకులు కారని అన్నారు. విద్యుత్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, లేదంటే ఆగస్టు 1, 2న బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. వాళ్లు ఎంత అబద్ధాలు చెబితే తాను అన్ని నిజాలు చెబుతానని సీఎం పేర్కొన్నారు.