calender_icon.png 20 September, 2024 | 5:25 AM

మిషన్ భగీరథలో 20 వేల కోట్ల అవినీతి

20-09-2024 02:48:45 AM

53 శాతం ఇండ్లకు మంచినీరు అందడంలేదు

  1. నేతల జేబులు నింపుకోవడం కోసమే ఆ ప్రాజెక్ట్
  2. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  3. నర్సంపేటలో ప్రభుత్వ దవాఖాన, వైద్య కళాశాల ప్రారంభం 
  4. హెల్త్ హబ్‌గా వరంగల్:మంత్రి దామోదర రాజనర్సింహ

హనుమకొండ, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథ పథకంలో భారీ అవినీతి, అక్ర మాలు జరిగాయని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. రూ.46 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో సుమారు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిషన్ భగీరథపై నిర్వహిం చిన సర్వేలో 53 శాతం ఇండ్లకు మంచినీరు అందడం లేదనే భయంకరమైన నిజం తెలిసిందని అన్నారు.

గురువారం వరంగల్ జిల్లా నర్సంపేటలో రూ.183 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ దవాఖాన, వైద్య కళాశాలను మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రజల కోసం చేసినట్టుగా లేదని, నాటి పాలకుల జేబులు నింపుకోవడానికి చేసిన ట్టుగా ఉందని విమర్శించారు. వాస్తవాలను ప్రజలకు తెలియచేసి ప్రతి గ్రామం లో ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని, ఇందులో బాగంగా నర్సంపేటలో 160 పడకల జిల్లా దవాఖానను ప్రారంభించామని చెప్పారు.

మెడికల్ కళాశాలలో మొదటి బ్యాచ్‌లో 50 మంది అడ్మిషన్ తీసుకున్నారని, త్వరలో తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. కళాశాలకు కావలసిన బోధనా సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతల ప్రభుత్వమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తోందని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో నిరుపేదలకు రూ.10 లక్షలు వైద్య ఖర్చుల కోసం ఉచితంగా ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు వేసి సుమారు రూ.657 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్చించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించాలని ఒక్కొక్క  పాఠశాలను రూ.100 నుంచి రూ.150 కోట్లతో 25 ఎకరాల్లో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు హాస్టల్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి బడ్జెట్‌లో రూ. 72 వేల కోట్లు కేటాయించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.

27 రోజుల్లో 23 లక్షల మందికి రూ.18 వేల కోట్లు రైతు రుణాలు రద్దు చేశామని, సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ ప్రయోజనం అందలేదని తెలిపారు. వీలైనంత త్వరలో వాటిని పరిష్కరించి ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతీ రైతన్నకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి హెల్త్‌కార్డులు, రేషన్‌కార్డులు వేర్వేరుగా అందించబోతున్నట్లు ఆయన తెలిపారు.

హెల్త్‌హబ్‌గా వరంగల్: మంత్రి దామోదర రాజనర్సింహ

అత్యవసర సమయాల్లో హైదరాబాద్‌కు వెళ్లనవసరం లేకుండా వరంగల్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చి వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏ ప్రభుత్వానికైనా మెదటి ప్రాధాన్యతగా విద్య, వైద్యం కావాలని అన్నారు. ఆ రెండింటిని అమలుపరిచే దిశగా తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. నర్సంపేట వైద్య కళాశాల దవాఖానను రూ.183 కోట్ల తో నిర్మించి ప్రారంభించుకున్నామని, గత ప్రభుత్వం కేవలం ఎన్నికల హామీగా మాత్ర మే ఇచ్చిన ఈ వైద్య కళాశాల, దవాఖానను కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి ఆచరణలో నిజం చేసి చూపిందని అన్నారు.

౫౦ సీట్ల మెడికల్ కళాశాల దవాఖానను ఈ ప్రాంతవాసులు సంపూర్ణంగా వినియోగించుకునేలా అందుబాటులోకి తీసుకొచ్చామ ని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ౪ వేల వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ఖాళీలు భర్తీ చేశామని మంత్రి గుర్తుచేశారు. త్వరలో వరంగల్‌లో రూ.30 కోట్లతో క్యాన్సర్ ట్రామా సెంటర్‌ను ఏర్పా టు చేస్తామని ప్రకటించారు. 7 వేల మందికి నర్సింగ్ పోస్టులు ఇచ్చామని, త్వరలో మరో 2500 మందికి పోస్టింగ్‌లు ఇచ్చే దిశగా నోటిఫికేషన్ విడుదల చేశామని వివరించారు. సామాన్య ప్రజలకు 20 నుంచి 45 నిమిషాల్లో వైద్య చికిత్సలు అదేవిధంగా ప్రాథమిక, ఏరియా, జిల్లా దవాఖానలు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

గత ప్రభుత్వం 2004 నుంచి ఇప్పటివరకు ట్రీట్‌మెంట్ ప్రొసీజర్ చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే 40 శాతం పెంచిందని అన్నారు. యాక్సిడెంట్లు జరిగిన ఒక గంట (గోల్డెన్ అవర్)లో వైద్యం అందించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ట్రామా సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలో రూ.2 వేల కోట్లతో 31 ఎకరాల్లో కొత్తగా ఉస్మానియా దవాఖానను నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. మరికొద్ది రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేయబోతున్నట్లు చెప్పారు. అంతకు ముందు వైద్య కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా క్యాంటీన్‌ను మంత్రులు ప్రారంభించి అక్కడ తయా రు చేసిన వివిధ రకాల చిరుతిండ్లను రుచిచూశారు. అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. 

మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ

15 మహిళ స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును మంత్రులు పంపిణీ చేశారు. నర్సంపేట మండలం రాజుపేటలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్డీఎఫ్ నిధుల కింద రూ.౨ కోట్లతో నిర్మించే బంజారా భవన్‌కు శంకుస్థాపన చేశారు. నర్సంపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో అమృత్ 2.0 పథకం కింద రూ.౨ కోట్లతో చేపట్టనున్న 600 కేఎల్‌ఈఎల్‌ఎస్‌ఆర్ నిర్మాణం, అంతర్గత పైప్‌లైన్ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ రాంచంద్రు నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.