calender_icon.png 16 November, 2024 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

6 వేల కోట్ల మొండి బాకీలు రికవరీ చేస్తాం

04-11-2024 12:00:00 AM

కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు

న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో తమకు రావాల్సి ఉన్న మొండి బకాయిల్లో రూ. 6,000 కోట్లు రికవరీ చేస్తామని ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో సత్యనారాయణ రాజు చెప్పారు.

ఈ ద్వితీయ త్రైమాసికంలో బ్యాంక్ మొండి ఖాతాల నుంచి రూ. 2,905 కోట్లు వసూలు చేసింది. గుడ్ లోన్స్ మాత్రమే మంజూరుచేస్తున్నందున, రానున్న నెలల్లో రుణాల రికవరీతో పోలిస్తే ఎన్‌పీఏలు చాలా తక్కువగా ఉంటాయని రాజు అంచనా వేస్తున్నామన్నారు. 

క్యూ4లో ఏఎంసీ పబ్లిక్ ఆఫర్

కెనరా బ్యాంక్ తన సబ్సిడరీ కెనరా రొబెకో అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ఏఎంసీ) పబ్లిక్ ఆఫర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఉంటుందని ఎండీ తెలిపారు. ఈ ఐపీవోకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి త్వరలో వస్తుందని భావిస్తున్నామన్నారు. ఈ సబ్సిడరీలో కెనరా బ్యాంక్‌కు 51 శాతం ఉండగా, ఐపీవోలో 13 శాతం వాటా విక్రయించాలన్నది బ్యాంక్ ప్రతిపాదన. 

ఇన్‌ఫ్రా బాండ్ల ద్వారా ఇప్పటికే రూ. 10,000 కోట్లు సమీకరించామని, ఆ నిధుల్ని రుణాలుగా ఇచ్చే ప్రక్రియ అమలు జరుగుతున్నదని రాజు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో విడత ఇన్‌ఫ్రా బాండ్ల ద్వారా నిధుల్ని సమీకరించే యోచన లేదన్నారు.