రాజ్యాంగ ప్రవేశికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలన్న పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ, నవంబర్ 25: రాజ్యాంగ ప్రవేశికలో 1976లో 42 రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదాల అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. ప్రవేశికలో కొత్తగా చేర్చిన లౌకిక, సామ్యవాద పదాలు తొలగించాలని దాఖలైన మూడు పిటిషన్లను సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందని, అది ప్రవేశికకు వర్తిస్తుందని స్పష్టం చేసింది.
దాదాపు 44 ఏళ్ల తర్వాత ఈ రాజ్యాంగ సవరణను సవాలు చేసేందుకు ఎలాంటి చట్టబద్ధమైన కారణం గానీ సరైన సమర్థన లేదని తెలిపింది. అంతేకాకుండా ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు ఈ సమస్యను లేవనెత్తారని ధర్మాసనం ప్రశ్నించింది. 42వ రాజ్యాంగ సవరణను సవాలు చేస్తూ సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి సహా మరో ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఆ సవరణపై పార్లమెంటులో చర్చ కూడా జరగలేదని వారు వాదించారు. ఎమర్జెన్సీ సమయంలో తీసుకొచ్చిన ఈ సవరణ చట్టబద్ధతను సైతం ప్రశ్నించారు. ఈ పిటిషన్లపై పలు వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసి సోమవారం ఆ పిటిషన్లను కొట్టివేసింది.
రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమే..
తీర్పు సందర్భంగా సోషలిజం, సెక్యులరిజం పదాలకు అర్థాలను కూడా ధర్మాసనం వివరించింది. వీటికి వేర్వేరు వివరణలు ఉన్నాయని, వివిధ రకాలుగా ఉపయోగి స్తున్నారని సుప్రీం పేర్కొంది. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, సమానత్వాన్నే ప్రతిబింబిస్తుందని వెల్లడించింది.