18-04-2025 02:04:41 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాజ్యాంగ విరుద్ధంగా నిజామాబాద్ జిల్లాలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న విలేజ్ డెవలప్మెంట్ కమిటీలను నిషేధించాలని, తాళ్ల రాంపూర్ గ్రామంలో గీత కార్మికులకు సాంఘిక బహిష్కరణ చేసి శ్రీరామనవమి వేడుకలకు వచ్చిన మహిళలను గెంటివేసి అవమానపరిచిన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని డిమాండ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కేజీ కేఎస్, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘గ్రామ అభివృద్ధి కమిటీ’ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గౌని వెంకన్న మాట్లాడుతూ... గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసి, శ్రీరామనవమి నాడు గుడిలోకి వచ్చిన మహిళలను గెంటివేసి అవమానపరిచి, ఉపాధి కల్పించే ఈత చెట్లను తగులబెట్టిన వీడీసీ కమిటీ సభ్యులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
అలాగే జాక్రాన్ పల్లిలో రజకులపై సాంఘిక బహిష్కరణ చేసిన వీడిసి కమిటీపై చట్ట రిత్య చర్యలు తీసుకోవాలని, వివిధ వృత్తులు చేస్తున్న కుర్మ, యాదవులు, ముదిరాజ్, బెస్త, వడ్డెర, నాయి బ్రాహ్మణ, నేత, దళితులు తదితరులను సాంఘిక బహిష్కరణ చేస్తున్న వీడీసీ కమిటీలను శాశ్వతంగా నిర్మూలించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్నపు సోమయ్య, జేరుపోతుల వెంకన్న, బిక్కీ వెంకటేశ్వర్లు, గునిగంటి మోహన్, మంద విక్రమ్ గౌడ్, దొమ్మటి సోమయ్య, గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్, ఎర్ర శ్రీనివాస్, కుల వివక్ష పోరాట సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చీపిరి యాకయ్య, దుడ్డేల రామమూర్తి, సిఐటియు నాయకుడు సమ్మెట రాజమౌళి, పట్టణ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బానోత్ వెంకన్న, పరిశాల కుమార్ తదితరులు పాల్గొన్నారు.