- చింతల్‌బస్తీలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపుపై ఎమ్మెల్యే దానంపై ఫైర్
- కూల్చివేతలు ఆపాలని అధికారులతో వాగ్వాదం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలనంగా మారారు. ప్రజాప్రతినిధి అయిన మా అనుమతి లేకుండా నిర్మాణాలను ఎలా కూల్చి వేస్తారంటూ పోలీసు అధికారులపై ఫైర్ అయ్యారు.
బుధవారం బంజారాహిల్స్ రోడ్డు నంబరు 3 నుంచి చింతల్ బస్తీ మీదు ఖైరతాబాద్ ప్రధాన రహదారి దాకా ఫుట్‌పాత్ ఆక్రమణలను ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే దానం నాగేందర్ తను అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ ప్రశ్నించారు. ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దావోస్ నుంచి సీఎం వచ్చే దాకా కూల్చివేతలు ఆపాలని లేకుంటే రోడ్డుపై బైఠాయించి లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ చేస్తానని హెచ్చరించారు. అయినా.. అధికారులు అవేమీ పట్టించుకోకుండానే ఫుట్‌పాత్ ఆక్రమణలను కూల్చివేశారు.