08-03-2025 11:45:02 PM
బీ టీంలను ఏమాత్రం ఉపేక్షించొద్దు..
నకిలీ నేతలకు బుద్ధి చెప్పాల్సిందే..
లేకపోతే పార్టీ ప్రజల మనసులను గెలుచుకోలేదు..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపు..
అహ్మదాబాద్: కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ బీజేపీ కోసం పనిచేసే వారిని వెంటనే ఏరివేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. గుజరాత్‌లో శనివారం పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌లో నకిలీ నేతలకు బుద్ధి చెప్పకపోతే, పార్టీ ప్రజల మనసులను గెలుచుకోలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిబద్ధత, నిజాయతీతో పనిచేయాలని, అప్పుడే ప్రజలు పార్టీకి ఓటు వేస్తారని వ్యాఖ్యానించారు. పార్టీలో రెండు రకాల కార్యకర్తలు, నాయకులు ఉన్నారని వెల్లడించారు. వీరిలో ఒక వర్గం నిత్యం ప్రజల మధ్యే ఉంటూ, పనిచేస్తున్నారని కొనియాడారు. కానీ.. మరోమర్గం ప్రజలతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం లేదన్నారు.
వీరిలో సగం మంది బీజేపీ కోసం పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ‘బీ’ టీంను ఏమాత్రం ఉపేక్షించొద్దని, ఎవరినీ వదిలిపెట్టొద్దన్నారు. పార్టీ గీత దాటిన వారు ఇప్పటికైనా తమ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. లేదంటే పార్టీ వేటు వేసేందుకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు. తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ పార్టీకి 22 శాతం ఓట్లు పెరిగాయని, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. కష్టపడి పనిచేస్తే అసాధ్యం సుసాధ్యమవుతుందనడానికి తెలంగాణ ఫలితాలే చక్కటి ఉదాహరణ అని పేర్కొన్నారు.