calender_icon.png 23 September, 2024 | 9:58 PM

పేజర్ల పేలుళ్ల వెనుక ఆ ఇద్దరు?

22-09-2024 12:04:05 AM

బుడాపెస్ట్, సెప్టెంబర్ 21: లెబనాన్‌లో హెజ్బొలా సంస్థకు చెందిన పేజర్లు, వాకీటాకీలు రెండురోజుల వ్యవధిలో ఒకేసారి పేలి పోవటం, ఈ పేలుళ్లలో 32 మంది చనిపోవటం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ డివైజులను తయారుచేసేటప్పుడే వాటిలో పేలుడు పదార్థాలు అమర్చారని, సమయం చూసి పేల్చివేశారని నిపుణులు చెప్తున్నారు. పేజర్లపై తైవాన్ కంపెనీ, వాకీటాకీలపై జపాన్ కంపెనీకి పేటెంట్ ఉన్నట్టు తేలింది. అయితే ఈ పరికరాలను తాము తయారుచేయలేదని ఆ కంపెనీలు ప్రకటించటంతో వాటిని అసెంబుల్ చేసిన హంగేరీకి చెందిన ఎన్‌బీసీ, బల్గేరియాకు చెందిన నోర్టా గ్లోబల్ సంస్థలపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. 

కేరళ మూలాలు

పేలిపోయిన పేజర్లను తయారుచేసిన బల్గేరియన్ కంపెనీ నోర్టా గ్లోబల్ సంస్థను రిన్‌సన్ జోస్ అనే వ్యక్తి 2022లో స్థాపించాడు. అతని స్వస్థలం కేరళలోని వయనాడ్. అతడు నార్వే వెళ్లి ఆ దేశ పౌరసత్వం తీసుకొని వ్యాపారం చేస్తున్నాడు. జోస్ బంధు వులు వయనాడ్‌లోనే నివసిస్తున్నారు. జోస్ తండ్రి మనంతవాడిలోని ఒక టైలర్. పేలిపోయిన పేజర్ల ఘటనపై దర్యాప్తు జరిపిన నార్వే దర్యాప్తు సంస్థ సాన్స్ ఆ పరికరాలు తమ దేశం నుంచి వెళ్లలేదని ప్రకటించింది. దీంతో జోస్‌తోపాటు నోర్టా గ్లోబల్ ఈ వివాదం నుంచి బయటపడ్డాయి.

ఏడు భాషలు మాట్లాడగల సీఈవో

ఈ వివాదంలో చిక్కుకున్న మరో కంపెనీ బీఏసీ కన్సల్టింగ్ సంస్థ సీఈవో క్రిస్టియానా బర్సోనీ ఆర్సిడియాకోనో (49). ఆమె ఏకంగా ఏడు భాషలు మాట్లాడగలరు. ఆఫ్రికా, యూరప్‌లో అనేక మానవతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేజర్ల పేలుడుపై స్పందించిన ఆమె.. తన కంపెనీకి ఆ పరికరాలతో సంబంధం లేదని ప్రకటించారు. కానీ, ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవటం గమనార్హం.