calender_icon.png 27 April, 2025 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవులకు ఊరెళ్తున్నారా.. జరభద్రం!

26-04-2025 06:00:35 PM

ఇండ్లకు తాళాలు వేసి దూర ప్రయాణాలు చేసేవారు పోలీస్ వారికి సమాచారం అందించండి..

ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వేసవి కాలం సెలవులు ప్రారంభంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఇంటిని వదిలి దూర ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) అన్నారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో వేసవి సెలవుల దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని,ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీని ముమ్మరం చేస్తున్నామన్నారు. ఈ విషయంలో జిల్లా పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా, ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి. దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇండ్ల పరిసర ప్రాంతాల్లో నిఘాను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు చెప్పడం మంచిదన్నారు. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.

ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను తమ వెంట తీసుకెళ్లాలి. బ్యాగుల్లో బంగారు నగలు,డబ్బు పెట్టుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు బ్యాగులు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం. కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా సీసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 నకు ఫోన్ చేసి సమాచారం అందించాలి.