హసీనా రాజీనామా తర్వాత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ తన ప్రసంగంలో చెప్పారు. బంగ్లా త్రివిధ దళాలతో పాటు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సభ్యులు అధ్యక్షుడి నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రకటన చేశారు. నోబెల్ గ్రహీత, ఆర్థిక వేత్త మహమ్మద్ యూనస్ సలహా మేరకే తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం జరిగింది.
మహమ్మద్ యూనస్
సామాజిక కార్యకర్త, ఆర్థిక వేత్త, బ్యాంకర్‌గా ప్రసిద్ధి. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేశారనే ఘనత సాధించి 2006లో నోబెల్ శాంతి పురస్కారంతో పాటు పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. బంగ్లాలో పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారు. సొంతంగా చిరు వ్యాపారాలు ప్రారంభించేందుకు పేదలకు దీర్ఘకాలిక రుణాలు అందించి గ్రామీణ స్థాయిలో బ్యాంక్ స్థాపించారు.
ఖలేదా జియా
నియంతగా పేరొందిన బంగ్లా మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్య, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత. ఆయన హత్య తర్వాత ఆమె బంగ్లాకు ప్రధాని అయ్యారు. 1991లో గెలిచి బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధాని అయ్యారు. మూడు సార్లు ఆ పదవిలో ఉన్నారు.
తర్వాత 1996లో రెండోసారి విజయం సాధించారు. చివరిగా 2001 మధ్య ప్రధానిగా పనిచేసి దిగిపోయారు. అనంతరం అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో ఆమెకు 2018లో పదిహేడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ శిక్షతో ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారారు. అయితే 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
నహిద్ ఇస్లామ్
బంగ్లా ప్రభుత్వాన్ని కూల్చిన ఉద్యమాన్ని నడిపిన 26 ఏళ్ల యువకుడు. మొత్తం ఉద్యమాన్ని ఈ యువకుడే సమన్వయం చేయడం విశేషం. ఇతను ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి. జూలైలో రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం ప్రారంభించి అరెస్టు అయ్యాడు.
అప్పుడే తొలిసారి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత అదే ఉద్యమం తుఫాన్‌గా మారి ప్రభుత్వాన్ని కూల్చింది. మంగళవారం నహిద్‌తోపాటు ఇతర విద్యార్థి నాయకులు ఆర్మీ చీఫ్‌తో భేటీ అయ్యారు. వీరు సైన్యం లేదా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అంగీకరించడం లేదు.