calender_icon.png 18 April, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ భూములు హెచ్‌సీయూవే

11-04-2025 01:31:12 AM

  1. రేవంత్ సర్కార్ అన్ని నిబంధనలు ఉల్లంఘించింది..
  2. లక్షల చెట్లను ధ్వంసం చేసిన సీఎం, సీఎస్, అధికారులపై చర్యలు తీసుకోవాలి
  3. కేంద్ర సాధికారిక కమిటీకి మాజీమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ బృందం వినతి

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కంచ గచ్చిబౌలిలోని భూములు హెచ్‌సీయూవేనని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణాన్ని, వన్యప్రాణులు, అటవీ సంపదను ధ్వంసం చేస్తోన్న సీఎం, సీఎస్, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల పరిశీలనకు హైదరాబాద్ వచ్చిన పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ(సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ)ని హరీశ్‌రావు నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం హోటల్ తాజ్‌కృష్ణలో కలిసి వినతి పత్రం అందించింది. అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కమిటీకి 11పేజీల వినతిపత్రం, 200 పేజీల డాక్యుమెంట్లు ఇచ్చినట్లు చెప్పారు.

వాల్టా చట్టం ప్రకారం చెట్టును కొట్టాలంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ముందస్తు అనుమతి తీసుకోవాలని, అటవీశాఖ అనుమతితో ఒక్కో చెట్టుకు రూ.400 డిపాజిట్ చేయాలని ఉన్నా.. అన్నింటినీ సర్కారే ఉల్లంఘించిందని మండిపడ్డారు. చెట్లు కొట్టడానికి టీజీఐఐసీ దరఖాస్తు చేసుకుంటే పోలీసులు న్యాయబద్ధమా కాదా అని కూడా ఆలోచనలు చేయలేదన్నారు.

యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నా, తాము ఏప్రిల్ 2న పీసీసీఎఫ్‌కు లేక రాసినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంత విధ్వంసం జరుగుతున్నా అటవీశాఖ నుంచి స్పందనే లేదని విమర్శించారు.  ఒక జింకను చంపినట్లు ఆరోపణలు వచ్చిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను జైల్లో పెడితే, మూడు జింకల మృతికి కారణమైన సీఎంపై ఏ చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు.

గతేడాది అక్టోబర్ 22న ఈ భూమిని తాకట్టుపెట్టి ప్రభుత్వం రూ.10వేల కోట్లు అప్పు తీసుకొన్నదని, అప్పు ఇప్పించిన వ్యక్తికి 169 కోట్ల 84 లక్షల బ్రోకర్ ఫీజు కట్టిందని ఆరోపించారు. ఈ భూముల్లో చెట్ల నరికివేతతో సీఎం ఏడు చట్టాలను దుర్వినియోగం చేశారని, ప్రభుత్వ ఉల్లంఘనలు అన్నీ కమిటీ ముందుంచామని తెలిపారు.