calender_icon.png 1 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ భూముల విలువ లక్షల కోట్లు!

01-07-2024 12:48:18 AM

పీఎస్‌యూ ల్యాండ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్

వేలాది ఎకరాలను తిరిగి తీసుకునే ప్రయత్నం

ప్రైవేటుపరం చేయొద్దని కేంద్రానికి వేడుకోలు

ఎన్‌వోసీ కోసం రాష్ట్ర పరిశ్రమలశాఖ వద్ద.. దాదాపు 27 సంస్థల దరఖాస్తులు

ఎన్‌వోసీ ఇచ్చేది లేదంటున్న పరిశ్రమల శాఖ

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): ప్రభుత్వ రంగ సంస్థ (పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్- పీఎస్‌యూ) ల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సమీకరించి, ద్రవ్యలోటు తగ్గించుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ జాబితాలో తెలంగాణలోని పలు కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రభుత్వ సంస్థలకు ఇచ్చిన భూములను సేకరించి విక్రయించే ఆలోచనలో కేంద్రం ఉంది.

ఈ క్రమంలో ఆ భూములను తిరిగి తీసుకునేందుకు రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజే శారు. తెలంగాణలో కేంద్రం ఆధ్వర్యంలో నడిచే కంపెనీల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో బీఆర్‌ఎస్ సర్కారు కూడా పీఎస్‌యూ ల్యాండ్స్‌ను తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించింది.

నాటి ఐటీ మం త్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ కూడా రాశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యం లో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పీఎస్‌యూ భూముల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు కొత్త సంస్థలను ఏర్పాటు చేయాలని లేదా, ఆ భూములను రాష్ట్రానికి ఇవ్వాలని కేంద్రమంత్రికి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. తాజాగా జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి ఓకే చెప్పిన కేంద్రం.. ఈ సమ స్యకు కూడా పరిష్కారం చూపిస్తుందన్న ఆశతో రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రయత్నాలను చేస్తోంది.

13 వేల ఎకరాలు

గతంలో ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటుచేసిన నేపథ్యంలో వాటికి అవసరమైన భూములను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిచింది. వాటినే పీఎస్‌యూ భూములు అంటారు. తెలంగాణలో దాదాపు 60 వరకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు ఉన్నాయి. వీటికోసం దాదాపు 13 వేల ఎకరాలను నాటి రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించినట్లు అంచనా. దాదాపు 27 సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్, ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్), హిందుస్థాన్ మెషిన్ టూల్స్, హెచ్‌ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బీడీఎల్ సహా పలు కంపెనీలను ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. వీటిని ప్రైవేటీకరిస్తే.. వాటికి కేటాయించిన భూములను తిరిగి రాష్ట్రానికి అప్పగించాలని స్థానిక ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. 

ఎన్‌ఎల్‌ఎంసీ పేరుతో కార్పొరేషన్

ద్రవ్య లోటును తగ్గించుకునే ఉద్దేశంతో కేంద్రం తమ పరిధిలో ఉన్న భూములను విక్రయించాలని చూస్తోంది. ఈ క్రమంలో ఉత్పాదకత లేని సంస్థల భూములను సేకరించే లక్ష్యంతో నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) అనే స్పెషల్ పర్పస్ వెహికిల్ చట్టబద్ధమైన  సంస్థను కేంద్రం ఏర్పాటు చేసింది. దీన్ని కేంద్ర హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తోంది. ఎన్‌ఎల్‌ఎంసీ ఆధ్వర్యంలో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసి.. ఆ భూములను ప్రైవేటీకరించడం లేదా విక్రయించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బహిరంగ మార్కెట్‌లో రూ.లక్షల కోట్లు

ఒక్కో కంపెనీకి వంద ఎకరాలకు తగ్గకుండా నాడు ప్రభుత్వం కేటాయించింది. తొలి విడత కింద ఆరు కంపెనీలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చూస్తున్నట్లు తెలుస్తోంది. తొలి విడత ప్రైవేటీకరణ జాబితాలో హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్, ఐడీపీఎల్, హిందుస్థాన్ మెషిన్ టూల్స్, సీసీఐ, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉన్నాయి. వీటిలో ఒక్క ఐడీపీఎల్ పరిధిలోనే 890 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములు మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నాయి. ప్రభుత్వ ధరల ప్రకారమే ఇక్కడ ఎకరం రూ.50 కోట్లు ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. సర్కారు విలువ ప్రకారమే రూ.44,500 కోట్లు అన్న మాట.

ఇక బహిరంగ మార్కెట్‌లో ఈ భూముల విలువ రూ. లక్ష కోట్లు దాటుతుందని పరిశ్రమల శాఖ వర్గాలు అంటున్నాయి. హెచ్‌ఎంటీ పరిధిలో కూడా దాదాపు 800 ఎకరాలు, మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిధిలో దాదాపు 3,025 ఎకరాలు, ఆదిలాబాద్‌లోని సీసీఐ పరిధిలో 772 ఎకరాల భూమి ఉన్నది. ఇలా ప్రతి కంపెనీకి వందలాది ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ భూముల్లో అధిక భాగం ప్రైమ్ ఏరియాలోనే ఉన్నాయి. వాటి ధర బహిరంగ మార్కెట్‌లో రూ.లక్షల కోట్లు పలుకుతున్నది. అందుకే అంత విలువైన పీఎస్‌యూ భూములను వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం లేదు.

ప్రైవేటీకరణకు ‘ఎన్‌వోసీ’ కొర్రీ

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రయత్నిస్తున్నా.. కఠినమైన నిబంధనల కారణంగా అది సాధ్యం కావడం లేదు. కేంద్రం ఆయా సంస్థలను ప్రైవేటీకరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఎన్‌వోసీ’ తీసు కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎన్‌వోసీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. దీంతో గత మూడేళ్లుగా ప్రైవేటీకరణ అంశం ముందుకు సాగడం లేదు. ఎన్‌వోసీ కోసం పరిశ్రమల శాఖకు ఇప్పటివరకు 27 సంస్థలు దరఖాస్తు చేసుకున్నట్లు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఎన్‌వోసీ ఇస్తే తమకు నష్టం జరుగుతుందని, అందుకే క్లియరెన్స్ ఇచ్చే ప్రసక్తే లేదని ఆయా కంపెనీలకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తేల్చి చెప్పినట్లు సమాచారం.