అనురాగ్ విద్యా సంస్థల భూములపై రగడ
కళాశాల ఆవరణలో ఇరువర్గాల బాహాబాహి
పోలీసులకు పరస్పర ఫిర్యాదులు
ఘట్‌కేసర్, ఆగస్టు 26 : తమ భూములను కబ్జా చేసి మెడికల్ కళాశాల నిర్మాణం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తులు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన అనురాగ్ మెడికల్ కాలేజీ ఆవరణలో ఆందోళనకు దిగారు. బఫర్ జోన్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నీటి పారుదల శాఖ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై దుమారం సద్దుమణుగక ముందే ఈ ఆందోళన కలకలం రేపింది. కళాశాలకు చెందిన కొంతమంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా, దాడికి దిగటంతో గందరగోళం నెలకొంది.
ఇరువర్గాలు ఒకరినొకరు దూషించుకోవటంతోపాటు కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 796 లోని మొత్తం 11 ఎకరాలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల పేరు మీద 7.5 ఎకరాల భూమి ఉంది. మిగతా 3.5 ఎకరాల భూమి హయత్‌నగర్ మండలం కుంట్లూర్‌కు చెందిన మాజీ సర్పంచ్ కళ్లెం ప్రభాకర్‌రెడ్డితోపాటు అతని భాగస్వామి రాజేశ్ పేరు మీద ఉంది.
కాగా, 7.5 ఎకరాల స్థలం మాత్రమే తమ విద్యా సంస్థల ఆధీనంలో ఉందని, ఒక్క అంగుళం కూడా ఎక్కువ లేదని వాదిస్తుండగా.. తమ 3.5 ఎకరాల స్థలం కబ్జా చేశారని అనుచరులతో కలిసి ప్రభాకర్‌రెడ్డి సోమవారం అనురాగ్ కళాశాల ఆవరణలోకి వెళ్లారు. కళాశాలకు చెందిన ప్రదీప్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి అడ్డుకోగా వారిపై దాడికి దిగారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ప్రభాకర్‌రెడ్డి, రాజేశ్ మరికొంత మంది తమకు న్యాయం జరుగాలని ప్లకార్డులు పట్టుకుని ఆందోళనకు దిగారు. అనంతరం ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులు అందాయని విచారణ జరిపి కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపనున్నట్టు పోలీసులు తలిపారు.