ఇప్పుడే కాదు.. అప్పట్లోనూ హారర్, సస్పెన్స్ జానర్‌లో సినిమాలు వచ్చి మంచి సక్సెస్ సాధించాయి. ఆసక్తికరంగా నటశేఖర కృష్ణకు ఇలాంటి సస్పెన్స్ జానర్ చిత్రాలు వెదుక్కుంటూ వచ్చేవి. ‘గూఢచారి 116’లో సీక్రెట్ ఏజెంట్‌గా చేసి అలా మెప్పించారో లేదో ‘అవే కళ్లు’ చిత్రం ద్వారా ఆయనకు మరో అవకాశం దొరికింది.
ఏసీ త్రిలోక్ చందర్ దర్శకత్వంలో ఏవీ మెయ్యప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా 14 నవంబర్ 1967లో విడుదలైంది. అంటే ఈ సినిమా విడుదలై ఇవాళ్టికి 57 ఏళ్లవుతోంది. కృష్ణ, కాంచన ప్రధాన పాత్రల్లో నటించగా.. పద్మనాభం, రమణా రెడ్డి , గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజనాల తదితరులు కీలక పాత్రలు పోషించారు.
తెలుగులో కలర్‌లో విడుదలైన తొలి హారర్ సస్పెన్స్ మూవీ ఇదే కావడం గమనార్హం. ‘మా ఊళ్లో ఒక పడుచుంది.. దెయ్యమంటే భయమన్నది’ పాట ఇప్పటికీ మనకు ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.
ఆ పాట ఈ చిత్రంలోనిదే. సుశీల (కాంచన) ఇంట్లో వరుస హత్యలు జరుగుతుంటాయి. క్రిస్మస్ సెలవులకని ఇంటికి స్నేహితురాళ్లతో వచ్చిన సుశీలకు బెదిరింపు కాల్స్ వస్తుంటాయి. దీంతో ఆమె స్నేహితురాళ్లు భయంతో ఆమె ఇంటి నుంచి వెళ్లి పోతారు. ఆ తరువాత సుశీలకు హోటల్‌లో పని చేసే భాస్కర్ (కృష్ణ)తో పరిచయమవుతుంది.
సుశీల ఇంట్లో జరుగుతున్న విషయాలను ఆమె ద్వారా తెలుసుకుని ఆమె ఇంటికి వెళతాడు. సుశీలను చంపేందుకు హంతకుడు యత్నించగా భాస్కర్ అడ్డుకుంటాడు. ఆ పెనుగు లాటలో హంతకుడి కళ్లను మాత్రం చూస్తాడు. ఆ కళ్ల ఆధారంగా హంతకుడిని భాస్కర్ ఎలా కనిపెట్టాడు? అసలు భాస్కర్ ఎవరు? అనేదే కథ. కథ అంతా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
ఈ సినిమానే ఏకకాలంలో తెలుగు, తమిళ్‌లో నిర్మిం చారు. తమిళ్‌లో ఈ చిత్రం ‘అదే కంగల్’ పేరుతో తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో చిత్రాలను తెరకెక్కించేటప్పుడు ఇతర సినిమాలకు మించిన జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి సస్పెన్స్ వీడితే ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తి కొరవడుతుంది.
కాబట్టి ప్రేక్షకుడిని మెప్పించే సన్నివేశాలు ఉండాలి. బలమైన కథనం, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి తప్పనిసరి. అన్నీ సరిగ్గా ఉంటేనే సస్పెన్స్ థ్రిల్లర్ బాక్సాఫీస్‌ను గడగడలాడిస్తుంది. అలాంటి కథే ఇది.