calender_icon.png 26 November, 2024 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ 52 ఎకరాలు నిషేధితమే

30-10-2024 12:54:27 AM

  1. రంగారెడ్డి కలెక్టర్ ఉత్తర్వుల కొట్టివేత 
  2. తీర్పు వెలువరించిన ఉన్నత న్యాయస్థానం

హైదరాబాద్, అక్టోబర్ 29 (విజయక్రాం తి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండ లం గుట్టల బేగంపేట సర్వే నంబర్ 63లోని 52 ఎకరాల విలువైన భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించడం చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించింది. అది చెల్లదని స్పష్టంచేసింది.

ఆ భూమిని నిషేధిత జాబితాలోంచి తొలగిస్తూ అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్‌కుమార్ 2022లో ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. గుట్టల బేగంపేట (ఎంసీఆర్‌హెచ్చార్డీ సమీపంలో)లోని దాదాపు 78 ఎకరాల భూమి కంచ సర్కారీ (ప్రభుత్వ భూమి)గా రికార్డుల్లో నమోదై ఉంది. ఈ భూమిపై 1950 నుంచి కోర్టు వివాదాలున్నాయి.

2018లో ఈ భూములపై హైకోర్టు స్టేటస్‌కో కూడా జారీచేసింది. అయితే, 2022లో 78 ఎకరాల్లోని 52 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగిస్తూ రిజిస్ట్రేషన్ చేయడానికి అనుకూలంగా రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.

తమ ప్రత్యర్థులైన ప్రైవేటు పార్టీలకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ చేయడానికి వివాదంలోని భూములను నిషేధిత జాబితా నుంచి తొలిగించారని, కలెక్టర్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ భూవివాదంలో పార్టీలైన బుఖ్త్యార్ ఖాన్‌తోపాటు మరో ఇద్దరు 2022 అక్టోబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆ సమయంలోనే రంగారెడ్డి కలెక్టర్ జారీచేసిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ ముగియడంతో న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ ధర్మాసనం.. తాజాగా తీర్పు వెలువరించింది. కలెక్టర్ ఉత్తర్వులను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.

52 ఎకరాలపై 1950 నుంచి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న న్యాయపరమైన తగాదాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, ఏ ప్రాతిపదికన వదులుకుందో సరైన కారణాలు తెలుపలేదని పేర్కొంది. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలిగిస్తూ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టారు.

రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22 ఏ ప్రకారం నిషేధిత జాబితా నుంచి డి-నోటిఫై చేయాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్స్‌పెక్టర్ జనరల్‌ను కోరుతూ కలెక్టర్ 2022 ఆగస్టు 10న ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేశారు.

ప్రభుత్వ తీరు సరికాదు 

తొలిరోజు విచారణ సందర్భంగానే ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ‘ఏ ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ల కోసం నిషేధిత జాబితా నుంచి డి-నోటిఫై చేశారు? ఆ భూమి తమది కాదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందా? 1950 నుంచి కోర్టుల ముందు పెండింగ్లో ఉన్న ఈ భూమిపై దావాను ప్రభుత్వ అధికారులు ఎలా విస్మరించారు’ అని ప్రశ్నించింది.

పెద్ద ఎత్తున అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిన రియాలిటీ సంస్థ బినామీకి భూమిని ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వచ్చాయి. రిజిస్ట్రేషన్లపై నిషేధాన్ని తొలగించకముందే, కంపెనీ లేఅవుట్‌ను రూపొందించి, చదరపు గజానికి రూ.2 లక్షలతోపాటు అధిక ధరకు ప్లాట్లను విక్రయించినట్టు ఆరోపణలు వచ్చాయి.

ఆ భూమిని మొదట ‘కంచ సర్కారీ’ భూమిగా ప్రకటించారు. నిషేధిత జాబితాలో చేర్చారు. ఈ భూములపై తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని 2018 లోనే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయినా, భూములను డీ-నోటిఫై చేయాలని నాటి కలెక్టర్ సిఫార్సు చేశారు. ఆస్తి రిజిస్ట్రేషన్ అమలు చేయడానికి జిల్లా రిజిస్ట్రార్‌కి ఆదేశాలు జారీచేశారు.

దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లో కలెక్టర్‌కు భూమి చట్టపరమైన చరిత్రపై అవగాహన ఉన్నా, హైకోర్టు యథాతథస్థితికి విరుద్ధంగా మరొక ప్రైవేట్ హక్కుదారుకు అనుకూలంగా సిఫార్సు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీని వెనుక రాజకీయ నాయకులు ప్రోద్బలం కూడా ఉందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం పై తీర్పునిచ్చింది.