calender_icon.png 30 November, 2024 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ పరీక్షల్లో ఈ ఏడాది ఇంటర్నల్స్ యథాతథమే

30-11-2024 01:59:38 AM

  1. వచ్చే ఏడాది నుంచే వంద మార్కులకు పరీక్షలు 
  2. మరో కొత్త జీవో జారీ.. గ్రేడింగ్ రద్దులో ఎలాంటి మార్పు లేదు 

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులను తొలగించడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ఒక్క విద్యాసంవత్సరంలో ఇంటర్నల్ మార్కులను తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం జారీచేసిన పాత ఉత్తర్వులను సవరించి శుక్రవారం కొత్త ఉత్తర్వులను విడుదల చేశారు.

పదో తరగతి వార్షిక పరీక్షల్లో గ్రేడింగ్‌ను రద్దు చేయడమే కాకుండా ఇంటర్నల్స్‌ను తొలగించిన విషయం తెలిసిందే. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలుచేస్తామని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. 80శాతం మార్కులకు బదులుగా 100శాతం మార్కులకు పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహిస్తామని ఆయా ఉత్తర్వుల్లో తెలిపింది.

అయితే ఇప్పటికే సగం విద్యాసంవత్సరం గడిచిపోయింది. పదో తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్‌మెంట్, సమ్మేటివ్ పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులు సైతం 80 శాతం మార్కులుంటాయన్న భావనతో వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యారు. అయితే విద్యాసంవత్సరం మధ్యలో నిర్ణయాలను మార్చడం వల్ల ఇబ్బందులెదురవుతాయన్న అభిప్రాయాలు వెల్లడయ్యాయి.

మధ్యలో ఉత్తర్వులను మార్చడంపై కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్య సంఘాలు సైతం ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒక్క ఏడాదికి ఇంటర్నల్స్‌ను కొనసాగించాలని తాజాగా ఉత్తర్వులిచ్చారు. అయితే 2025- విద్యాసంవత్సరం నుంచి ఇంటర్నల్స్ ఉండవు.

మొత్తం 100 మార్కులకు వార్షిక పరీక్షలను నిర్వహిస్తారు. అయితే గ్రేడింగ్ విధానం రద్దు విషయంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. ఈ విద్యాసంవత్సరం నుంచే గ్రేడింగ్ ఉండదు. మార్కులనే కేటాయిస్తారు.

ఇలా ఇంటర్నల్స్ రద్దు చేశామని ప్రకటించి ఒక రోజు గడవక ముందే ఇంటర్నల్స్ ఉంటాయని ఉత్తర్వులివ్వడం అటు టీచర్లను, ఇటు విద్యార్థులను గందరగోళానికి గురిచేసింది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం సృష్టించవద్దని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.