calender_icon.png 24 December, 2024 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి పంట బీమా లేనట్టే?

06-10-2024 01:59:35 AM

వానకాలం ముగిసినా పత్తాలేని ఇన్సూరెన్స్  

రుణమాఫీ అమలుపైనే సర్కార్ అష్టకష్టాలు 

ఆర్థిక భారంతోనేనని వ్యవసాయ శాఖ వెల్లడి

హైదరాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాం తి): పంట బీమా పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. రైతుల ప్రీమియం వాటా తామే చెల్లించి ఉచితంగా బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పిన మాటలు కాగితాలకే పరిమితమయ్యాయి. వానకాలం పంటలకు బీమా వర్తించేలా చూస్తామని హామీ ఇచ్చిన సర్కారు.. వానకాలం సీజన్ ముగిసినా ఇప్పటివరకు దాని ఊసెత్తట్లేదు.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది పంట బీమా అమలు లేనట్టేనని స్పష్టమవుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వీటికి ప్రభుత్వం రూ.10వేల చొప్పున నష్ట పరిహారం అందించింది. బీమా ఉంటే రైతులకు పెద్దమొత్తంలో పరిహారం లభించేదని రైతు సంఘాల నాయ కులు పేర్కొంటున్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా పంట బీమా విషయంలో నిర్లక్ష్యం చేయడంతో ఆకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు అప్పుల పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉం టుందని భావిస్తే అధికారం చేపట్టి 10 నెల లు గడుస్తున్నా ఇప్పటివరకు పంట బీమాపై దృష్టి సారించడంలేదు. 

గ్రామం యూనిట్‌గా 

రాష్ట్రంలో ప్రతి గ్రామం యూనిట్‌గా, పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పం ట బీమా అమలు చేసేలా ప్లాన్ చేశారు. ఆ ఏడాది రెండు పంటలకు కలిపి 1.32 కోట్ల ఎకరాల్లో పంట సాగు చేసే అవకాశం ఉం దని అధికారులు అంచనా వేశారు. గత ప్రభుత్వం 2019 నుంచి ఫసల్ బీమా పథ కం నిలిపివేసింది. దీంతో ఐదేళ్లుగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందక నష్టపోయారు.

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ సర్కార్ రాష్ట్రంలో తిరిగి పంటల బీమా అమలు చేస్తామని వాగ్దానం చేసింది. అంతేగాకుండా రైతుల వాటాను కూడా తామె చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులకు పైసా ఖర్చులేకుండా ఉచితంగా పంటల బీమా అందుబాటులోకి వస్తుందని రైతులు భావించారు. ఏటా రెండు పంటలకు రూ.2వేల కోట్లు ప్రీమియం రూపంలో ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించాల్సి వస్తుంది. ఇందులో రైతుల వాటా రూ.300 కోట్లు కూడా ఉంటుంది.  

పరిస్థితులకు అనుగుణంగా బీమా 

అకాల వర్షాలతో నష్టం జరిగితే ఒక రకంగా, కోత కోసి కల్లాల్లో ఉన్నప్పుడు నష్టం జరిగితే మరోవిధంగా, దిగుబడి స్వల్పంగా వస్తే పరిహారం అందించేందుకు ఇంకోవిధంగా ఆయా గ్రామాల పరిస్థితులకు అనుగుణంగా స్కీమ్‌ను అమలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.

దీనికి సంబంధించిన విధావిధానాలు ఇప్పటికే ప్రభుత్వానికి అందించింది. పంటల బీమా కోసం నిర్వహించే టెండర్లలో బీమా కంపెనీలు కోట్ చేసే ప్రీమియం ధరను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుంటుందని అధికారులు చెప్పారు.

ఆర్ధిక సమస్యలతో బీమా నిర్ణయం వాయిదా 

రాష్ట్ర ఆర్థిక పరమైన ఇబ్బందులతో బీమాపై ప్రభుత్వం వాయిదా వేసినట్టు అధికారులు చెప్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన రుణమాఫీ పూర్తి స్థాయి అమలు చేసేందుకే తంటాలు పడుతున్నాడని, రైతు భరోసా పంపిణీ కలుపుకొంటే తలకు మించిన భారంగా మారిందని వెల్లడించారు. బీమాను పూర్తి గా ప్రభుత్వమే భరిస్తుండటంతో సరిపడ నిధులు సమకూర్చుకున్న తరువాత ప్రారంభించవచ్చని జిల్లాల వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు.