calender_icon.png 3 October, 2024 | 5:57 AM

ఈసారీ మిల్లర్ల అసోసియేషన్లే గతి!

03-10-2024 02:53:50 AM

పది రోజుల క్రితమే మొదలైన వరి కోతలు

  1. ఇప్పటికీ ఎక్కడా తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు 
  2. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకొంటున్న రైతులు
  3. మిల్లర్లకు ధాన్యం కేటాయింపునకు ఈసారి 25 శాతం బ్యాంకు గ్యారెంటీ షరతు 
  4. కొనుగోలు ప్రణాళికే సిద్ధం కాకపోవటంతో అమలు అసాధ్యమే!
  5. మళ్లీ మిల్లర్ల అసోసియేషన్లు చెప్పినవారికే ధాన్యం? ఈ వానకాలంలో 80 శాతం సన్న వడ్ల సాగు 
  6. 1౦౦ లక్షల టన్నులు వస్తుందని అంచనా 
  7. క్వింటాల్‌కు రూ. 5౦౦ బోనస్ ఇవ్వాల్సిన సర్కారు 
  8. బోనస్ తప్పించుకొనేందుకే కొనుగోలు ఆలస్యమా?

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు.. రాష్ట్రంలో వానకాలం ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న అలసత్వం సర్కారుకు విషంగా, మిల్లర్ల అసోసియేషన్లకు అమృతంగా మారుతున్నది. ఈ విషయం తెలిసినా పౌరసరఫరాల శాఖగానీ, ప్రభుత్వ పెద్దలుగానీ త్వరపడటం లేదు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతవరకు ప్రభుత్వమే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి నేరుగా ధాన్యం కొని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అందించేది. అయితే, మిల్లులకు నేరుగా కాకుండా మిల్లర్ల అసోయేషన్ల సిఫారసులపై ఆధారపడి ధాన్యం సరఫరాచేసేది. అయితే, చాలామంది రైస్ మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్న బియ్యంగా మార్చి ప్రైవేటుగా అమ్ముకొని ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా తేలారు.

దీంతో ప్రస్తుత ప్రభుత్వం ధాన్యం సరఫరాకు కొత్త నిబంధన తీసుకొచ్చింది. మిల్లర్‌కు ఎంత ధాన్యం సరఫరా చేస్తారో దాని విలువలో ౨౫ శాతం సొమ్మును ముందుగానే బ్యాంకు గ్యారెంటీగా సమర్పించాలని నియమం పెట్టింది. ఆ విధానం అమలులో జరుగుతున్న తీవ్ర జాప్యంతో ఈ సీజన్‌కు బ్యాంకు గ్యారెంటీ నిబంధన సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించటంలేదు. దీంతో అనివార్యంగా మళ్లీ ఎలాంటి బాధ్యత తీసుకోని మిల్లర్ల అసోసియేషన్ సిఫారసుల మేరకే మిల్లర్లకు ధాన్యం సరపరా చేయాల్సి వస్తోంది.

రాష్ట్రం దాటిపోతున్న సన్న వడ్లు

రాష్ట్రంలో వరి కోతలు మొదలై పది రోజులు దాటింది. కానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోస ఇంకా ఒక్కటంటే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని కూడా తెరువలేదు. దీంతో రైతులు పంట కోయగానే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్మేస్తున్నారు. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొంటున్న ఇతర రాష్ట్రాల వ్యాపారులు మన రాష్ట్ర సన్నవడ్లను కొనేస్తున్నారు.

నిజానికి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి నెల రోజుల ముందుగానే ప్రణాళికను సిద్ధంచేయాల్సి ఉంటుంది. అలా అయితేనే హమాలీలు, గన్నీ బ్యాగులు, కొనుగోలు కేంద్రాలు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లలకు తరలించడం.. ఆపై మిల్లింగ్ అయిన బియ్యాన్ని గోదాములకు తరలించడం లాంటివి సరైన సమయంలో సాగుతాయి. ఇదంతా చూడాల్సిన పౌర సరఫరాల శాఖ ఇంకా స్పందించినట్టు కనపడటం లేదు. ధాన్యం కొనుగోలుకు ఇప్పుడిప్పుడే పౌర సరఫరాల శాఖ ప్రణాళికలు వేస్తోంది. 

ఆరో వేలుగా అసోసియేషన్లు

ఇప్పటి వరకు మిల్లింగ్ కోసం మిల్లర్లకు ధాన్యం ఇవ్వాలంటే రైస్ మిల్లర్ల అసోసియేషన్‌పై ప్రభుత్వం ఆధారపడుతూ వస్తున్నది. అసోసియేషన్ పెద్దల అనుమతితోనే మిల్లర్లకు ధాన్యం కేటాయించేవారు. మిల్లర్‌కు ప్రభుత్వానికి మధ్యన అగ్రిమెంట్ జరిగేది. అలాగే ఇద్దరు మిల్లర్లు, అసోసియేషన్ గ్యారెంటీతో సంతకాలు చేయాల్సి ఉండేది. అప్పుడే ధాన్యం మిల్లర్‌కు సరఫరా అయ్యేది.

సంవత్సరాలుగా ఇలా చేసినా అనేక మంది మిల్లర్లు డిఫాల్టర్లుగా తేలారు. గ్యారెంటీగా సంతకం చేసిన అసోసియేషన్ ముందుకొచ్చి వారి నుంచి ప్రభుత్వానికి బియ్యం ఇప్పించిన దాఖలు కూడా లేవు.  ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వందలాది మిల్లర్ల నుంచి రూ.వేల కోట్ల విలువైన సీఎంఆర్ బియ్యం రావాల్సి ఉన్నది. ఆ ధాన్యాన్ని తిరిగి ఇప్పించే బాధ్యత అసోసియేషన్ తీసుకొన్నట్లు కనిపించటంలేదు. మిల్లరు, ప్రభుత్వం మధ్యలో లేని ప్రాధాన్యతను అసోసియేషన్‌కు కల్పించి ఆరో వేలు స్థానాన్ని కట్టబెట్టారు.  

25 శాతం బ్యాంకు గ్యారెంటీ

ఈ సీజన్ ప్రణాళికలో భాగంగా సివిల్ సప్లు శాఖ, మిల్లర్ల మధ్యన ఒక సమావేశం జరిగింది. ఇందులో 25 శాతం బ్యాంకు గ్యారెంటీ ఇస్తేనే మిల్లరుకు ధాన్యం ఇస్తామనే కొత్త నిబంధన పెట్టారు. కనీసం ఇలా అయినా మిల్లర్ సీఎంఆర్‌ను సకాలంలో అందించే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రణాళిక ఆలస్యమైంది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకోవాలి.

కానీ ఇక్కడో సమస్య ఉంది. బ్యాంకు గ్యారెంటీకి కనీసం 30 నుంచి 45 రోజుల తతంగం ఉంటుంది. మిల్లర్లు ఏదైనా ఆస్తులను చూపించి దాని వాల్యుయేషన్ చేయించి బ్యాంకు లోన్/గ్యారెంటీ తీసుకోవడానికి అంత సమయం పడుతుంది. ఇదంతా ఇప్పటికే పూర్తి కావాల్సిన తతంగం.

కానీ ఇప్పటివరకు ప్రణాళిక కూడా సిద్ధం కాకపోవడంతో అనుకున్న సమయంలోగా ధాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. మరో పది రోజుల్లో దసరా పండుగ ఉన్నది. ఈ లోగా ఏ ప్రక్రియ కూడా ప్రారంభం కాదు. దసరా తరువాతనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటైనా.. ధాన్యం తరలింపు అయినా మొదలయ్యేది.

మళ్లీ అసోయేషన్ల వద్దకే

ధాన్యం వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. మిల్లర్లకు ధాన్యం కేటాయింపుపై ఒక నిర్ణయం తీసుకోలేదు. వచ్చిన ధాన్యం ప్రైవేటు వ్యాపారులు కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన మార్గం హడావుడిగా ధాన్యం కొనుగోలు చేసి.. మళ్లీ అసోసియేషన్ల ద్వారా ధాన్యాన్ని సరఫరా చేయడమే. అంటే జరుగుతున్న ఆలస్యం అంతిమంగా అసోసియేషన్లకే లాభం కలిగించేలా ఉందన్నమాట. ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ అసోసియేషన్లకే అందలం ఎక్కించి.. తద్వారా అసోసియేషన్లలో కీలకమైన వారికి అప్పనంగా అజమాయిషీ అప్పగించబోతున్నారన్నమాట.  

మొదలైన వరి కోతలు.. 

వ్యవసాయ శాఖ ప్రకారం ఈ వానకాలంలో (2024 సీజన్)లో సుమారు 120 నుంచి 125 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా. ఈసారి రాష్ట్ర రైతులు సన్న రకాలవైపు మొగ్గు చూపారు. దీంతో మొత్తం దిగుబడిలో సుమారు 75 నుంచి 80 శాతం వరకు సన్న రకం వడ్లే వస్తాయని అంచనా వేశారు. 20 నుంచి 25 శాతం దొడ్డు రకం వడ్లు ఉంటాయని పౌర సరఫరాల శాఖ చెబుతోంది. రాష్ట్రంలో వరి కోతలు మొదట ప్రారంభమయ్యేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే.  కానీ అక్కడ ఇప్పటివరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా తెరవలేదు. 

బోనస్ తప్పించుకొనే ఎత్తుగడా? 

రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ప్రతి క్వింటాల్ వడ్లకు రూ.౫౦౦ బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బోనస్‌ను సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని మాట మార్చింది. దీంతో రైతులంతా సన్న వడ్లే పండించారు. ఇప్పుడు రాష్ట్రంలో ౮౦ శాతం ధాన్యం సన్నరకమే వస్తున్నది.

ఇంత భారీ మొత్తానికి బోనస్ ఇవ్వాలంటే ప్రభుత్వానికి వేలకోట్ల రూపాయలు కావాలి. అందువల్ల ధా న్యం కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేస్తే రైతులు ప్రైవేటు వ్యాపారులకు తమ వడ్లను అమ్ముకొంటారు. అలా చాలావరకు ప్రైవేటుకు వెళ్లిపోయిన తర్వాత తీరి గ్గా కొనుగోలు కేంద్రాలు తెరిచి అక్కడికి తెచ్చిన ధా న్యానికే రూ.5౦౦ బోనస్ అంటే సరిపోతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నదనే విమర్శలు కూడా వినిపి స్తున్నాయి. పంట అమ్ముకోకుండా రైతులు ఎలాగూ ఎక్కువ కాలం ఆగరు కాబట్టి ప్రణాళిక పేరుతో ఆలస్యం చేస్తే బోనస్ బాధను తప్పించుకోవచ్చని ప్రభుత్వం ఎత్తు వేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.