calender_icon.png 10 January, 2025 | 11:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ రాఖీ పౌర్ణమి ప్రత్యేకతలు

19-08-2024 12:00:00 AM

తమ సోదరుడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమకు గుర్తుగా సోదరి అన్న లేదా తమ్ముడికి రాఖీ కడతారు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రక్షాబంధన్ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్ట్ 19వ తేదీ మధ్యాహ్నం 1.29 గంటల వరకు భద్ర కాలం ఉంటుంది. అందుకే సూర్యోదయానికి ముందు రక్షా బంధన్ పండుగను జరుపుకోవచ్చు. లేదంటే మధ్యాహ్నం 1.30 తర్వాత జరుపుకోవాలి. అప్పటి నుంచి ముహూర్తం రాత్రి 7 గంటల వరకు నిరంతరం ఉంటుంది. రాఖీ కట్టడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 7 గంటల మధ్య ఉంటుంది. అందుకే సాయంత్రం పూట రాఖీ కట్టడం శ్రేయస్కరం. నిజానికి రక్షా బంధన్ పండుగను జన్మాష్టమి వరకు జరుపుకుంటారు. కుటుంబానికి దూరంగా నివసించే వారు జన్మాష్టమి వరకు రాఖీ కట్టవచ్చు. 

రాఖీ ఎలా కట్టాలి?

రాఖీ కట్టే ముందు మీరు కూర్చునే దిశ తప్పనిసరిగా చూసుకోవాలి. సోదరుడు తూర్పు ముఖంగా కూర్చుంటే సోదరి పడమర లేదా ఉత్తర ముఖంగా ఉండాలి. పొద్దున రాఖీ కట్టించుకుని మధ్యాహ్నానికి తీసేయడం వంటివి చేయకూడదు. జన్మాష్టమి వరకు ఈ రాఖీ ఉంచుకోవాలి. పవిత్రమైన రోజు మాత్రమే దీన్ని చేతి నుంచి తీసేయాలి. రక్షా బంధన్ నాడు రాఖీ కట్టిన తర్వాత కనీసం జన్మాష్టమి వరకు అయినా ఉంచుకోవాలి. రాఖీ నలుపు లేదా నీలం రంగులో ఉండకుండా చూసుకోవాలి.

రాఖీ ఎరుపు లేదా పసుపు రంగులో ఉండాలి. దాని రక్షణ దారం పట్టుతో ఉండాలి. జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దాన్ని ఎక్కడైనా చెట్టు దగ్గర ఉంచండి లేదా పారే నీటిలో వేయండి. రాఖీని ఎక్కడంటే అక్కడ విసిరేయకూడదు. రాఖీని ఎక్కువ రోజు చేతికి ఉంచుకోకూడదు. జన్మాష్టమి రోజు తీసి నీటిలో వదలాలి. లేదంటే చెట్టు కింద ఉంచాలి. ఒక వేళ చేతికి కట్టిన తర్వాత రాఖీ ఊడిపోతే దాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి పూజ గదిలో ఉంచుకోవాలి. లేదంటే నీటిలో విడిచిపెట్టాలి.

హారతి పళ్లెంలో ఇవి ఉండాల్సిందే

తన తోడబుట్టిన సోదరిని కంటికి రెప్పలా కాపాడతానంటూ సోదరుడు ఆశీర్వదించడం ఆనవాయితీ. తనకు రాఖీ కట్టిన సోదరికి కానుకలు ఇవ్వడం కూడా ఆనవాయితీ. భారత దేశంలో రాఖీ పండగను భక్తి శ్రద్ధలతో ఉల్లాసంగా జరుపుకుంటారు. అయితే రాఖీ కట్టేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు మర్చిపోకూడదు. రాఖీ కట్టేసమయంలో సోదరి ఒక హారతి పళ్లెంతో వస్తుంది. అందులో ఏం ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పళ్లెం వెండిది అయితే చాలా మంచిది. అందులో కొత్త గుడ్డను ఉంచాలి. పూజ ప్లేట్ మధ్యలో ఓం లేదా స్వస్తిక్ వేయండి. పూజ చేసే పళ్ళెంలో విరిగిపోని బియ్యంతో అక్షింతలు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే నుదుటిపై పెట్టేందుకు తిలకం.. కుంకుమ భరిణి ఉండాలి. రాఖీలో హారతి సమయంలో సోదరుడి నుదిటిపై తిలకం.. ఆ తర్వాత అక్షింతలు వేయాలి.