calender_icon.png 2 April, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తుల పంపకంలో ఈ పంచాయితీ.!

27-03-2025 12:53:43 AM

  • పోర్టల్‌లో సాంకేతిక లోపాలు

అసెస్మెంట్లో బ్లాక్ నంబర్ తప్పుగా వస్తున్న వైనం

అధికారుల చుట్టూ తిరుగుతున్న బాధితులు

మెదక్, మార్చి 26(విజయక్రాంతి)ఃఆస్తుల పంపకంలో ఈ-పంచాయతీ పోర్టల్ సమస్యలను తెచ్చిపెడుతోంది.. పోర్టల్లో సాంకేతిక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆస్తుల పంపకం చేసుకుంటున్న సమయంలో అసెస్మెంట్లో బ్లాక్నంబర్ తప్పుగా రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, గ్రామ పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం ఉండడం లేదు.

గ్రామ పంచాయతీతో సంబం ధం లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే మ్యూటేషన్ ప్రక్రియతో పాటు అసెస్మెంట్ నంబర్ కేటాయించడంతో ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పంచాయతీ డిమాండ్ రిజిష్టర్తో పాటు ధ్రువీకరణ పత్రం, ఇంటి రసీదుతో అసెస్మెంట్ నంబర్లు తప్పుగా నమోదైతే వాటిని జీపీ కార్యదర్శి రివిజన్ రిజిష్టర్ ఆధారంగా సరిదిద్దేవారు. కానీ ప్రస్తుతం సంబంధిత వ్బుసైట్లో ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. 

బ్లాక్ మారడంతోనే....

ప్రభుత్వం గ్రామాల్లో ఇంటి నిర్మాణం, ఇతరత్రా అనుమతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ఈ-పంచాయతీ పోర్టల్ను ప్రవేశపెట్టింది. సిటిజన్ లాగిన్ అనుమతులతో పాటు ఇతరత్రా అవసరాలకు లబ్దిదారులు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఖాళీ స్థలాలు, ఇళ్లు వంటి ఆస్తులను పంపకాలు చేసుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకునేప్పుడు మ్యూటేషన్ ప్రక్రియ ఇక్కడే పూర్తవుతోంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా బ్లాక్ మారి అసెస్మెంట్ నంబర్ కేటాయింపు జరుగుతోంది.  

ఇష్టారాజ్యంగా  నమోదు...

వ్యవసాయేతర భూములు, వ్యవసాయ భూముల ఆస్తుల రిజిస్ట్రేషన్లను ధరణి పోర్టల్ ప్రామాణికంగానే నిర్వహించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం పంచాయతీల్లో ఎన్పీబీ (నాన్ ప్రాపర్టీ బుక్)లో ఇళ్ళతో పాటు వ్యవసాయేతర భూముల వివరాలను నమోదు చేయించింది. ఈ సమయంలో పంచాయతీ డిమాండ్ రిజిష్టర్తో సంబంధం లేకుండా గ్రామాలు, పట్టణాల్లో జనాభా ఆధారంగా ఇండ్లు, ప్లాట్ల సంఖ్యను నిర్దేశించి నమోదు చేయాలని సూచించారు.

అయితే అప్పట్లో గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఇళ్లతో పాటు వ్యవసాయేతర ప్లాట్లకు అసెస్మెంట్ నంబర్లను కేటాయించారు. ఈ నంబర్లను ఆన్లైన్లో నమోదు చేశాక, నిర్దేశిత పోర్టల్ను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేశారు. అప్పట్లో సరిగా నమోదు చేయకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.