వెన్నెల కిషోర్ టైటిల్ రోల్
పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రైటర్ మోహన్ రచనాదర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. వంశీ నందిపాటి విడుదల చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకులు బాబీ కొల్లి, కళ్యాణ్‌కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ బాబి మాట్లాడుతూ.. ‘నేను, మోహన్ ఒకే డైరెక్టర్ దగ్గర రైటర్స్‌గా పనిచేశాం. ఈ సినిమాతో తను దూసుకుపోతాడనే నమ్మకం ఉంది’ అన్నారు. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. ‘చిన్న సినిమాలు పెద్ద హిట్ కావాలని ఎప్పుడూ కోరుకుంటాను. ఈ సినిమా విషయంలోనూ అదే కోరుకుంటున్నాను’ అన్నారు. హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో చాలా మంచి పేరు తీసుకొచ్చే సినిమా ఇది” అని చెప్పారు.
‘ఈ సినిమాకు నలుగురు ఆర్టిస్టులు, నలుగురు టెక్నిషియన్స్.. మొత్తం ఎనిమిది మంది ప్రొడ్యూసర్లున్నారు. కష్టానికి తగిన ఫలితం ఆశించకుండా కథపై, నాపై నమ్మకంతో సినిమా చేశారు. వాళ్లందరికీ లాభాలు పంచిపెట్టాలన్నదే నా ఉద్దేశం’ అని నిర్మాత వెన్నపూస రమణారెడ్డి అన్నారు. నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ.. ‘ఈ కంటెంట్‌ను బలంగా నమ్మాను. ఆ కంటెంట్ నన్ను గెలిపిస్తుందని నమ్ముతున్నాను. డిసెంబర్ 2024లో పుష్ప తర్వాత హైయ్యెస్ట్ గ్రాసర్ ఈ సినిమానే అవుతుంది.
ఈ సినిమా నచ్చలేదని ఎవరైనా అంటే నా నెంబర్‌ను సంప్రదించ వచ్చు. ఈ సినిమా నా కెరీర్‌ను, నటీనటులు, టెక్నీషియన్స్ కెరీర్‌ను నెక్స్ లెవెల్‌కు తీసుకెళ్తుంది’ అని చెప్పారు. దర్శకుడు మోహన్, ధీరజ్, డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేశ్ రాంబాల, సంగీత దర్శకుడు జ్ఞాన్, లిరిక్ రైటర్ పూర్ణాచారి, నటులు రవితేజ మహాదాస్యం, అనీష్ కురివిల్ల, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.