24-03-2025 04:48:10 PM
హాజరు కానున్న మాజీ మంత్రి పళ్లంరాజు, సౌరబ్ శుక్లా, అటికా, రథిన్ రాయ్, సుబ్బు..
సంగారెడ్డి (విజయక్రాంతి): మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం టెడ్ఎక్స్(TEDx) కి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(Gitam Deemed University), హైదరాబాద్ ప్రాంగణం వేదిక కానుంది. గీతం విద్యార్థిని దీక్షితా చెల్లాపిల్ల టెడ్ఎక్స్ గీతం హైదరాబాద్-2025 నిర్వహణ కోసం అనుమతి పొందినట్టు స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘మార్పుకు ఉత్ప్రేరకాలు’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ఈ టెడ్ టాక్స్ లో విభిన్న రంగాలకు చెందిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు పాల్గొని, తమ ఆలోచనలను విద్యార్థులతో పంచుకోనున్నట్టు తెలియజేశారు.
అనుభవజ్జుడైన విధాన రూపకర్తగా పేరొందిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(Central Human Resource Development), రక్షణ శాఖల మాజీ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని, నాయకత్వం, విద్యా విధానం, పాలనలపై ఆలోచించదగిన దృక్పథాలను పంచుకోనున్నారు. న్యూస్ మొబైల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్, పరిశోధనాత్మక జర్నలిస్టు, గ్లోబల్ ఫ్యాక్ట్-చెకర్ సౌరబ్ శుక్లా–జర్నలిజం, తప్పుడు సమాచారం, డిజిటల్ మీడియా విప్లవాలు గురించి వివరిస్తారు. ప్రముఖ పాత్రికేయురాలు అటికా అహ్మద్ ఫరూకి – ప్రజల అవగాహనను రూపొందించడం, అర్థవంతమైన మార్పు వైపు నడిపించడంలో మీడియా శక్తిపై చర్చించనున్నారు. ప్రఖ్యాత ఆర్థికవేత్త, భారతదేశ 13వ ఫైనాన్స్ కమిషన్ సలహాదారు డాక్టర్ రథిన్ రాయ్(Dr Rathin Roy) – ఆర్థిక పరివర్తన, విధాన రూపకల్పన, స్థిరమైన వృద్ధి వ్యూహాలను వివరిస్తారు.
ది లెర్నింగ్ కర్వ్ ఫౌండేషన్(The Learning Curve Foundation) సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి సుబ్బూ పరమేశ్వరన్ విద్య, విద్యార్థుల అభివృద్ధిని మార్చడంలో భావోద్వేగ మేధస్సు యొక్క కీలక పాత్రపై ప్రముఖంగా చర్చించనున్నారు. సినిమా, జర్నలిజం, రాజకీయాలు, క్రీడలు, డిజిటల్ ప్రభావంతో తమ అనుభవాలను పంచుకోనున్న ప్రముఖుల ప్రసంగాలు గీతం టెడ్ఎక్స్ ఆలోచించదగిన అనుభవాన్ని అందించగలదని ఆశిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆకర్షణీయమైన సంభాషణలు, శక్తివంతమైన కథలు, భవిష్యత్తును రూపొందించే మార్గదర్శక ఆలోచనలకు బాటలు వేయగలవని వారు అభిలషిస్తున్నారు. ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో పాల్గొని, ఆయా అంశాలపై అవగాహనను ఏర్పరచుకోవాలని విద్యార్థులకు స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ ప్రతినిధులు విజ్జప్తి చేశారు.