సినిమా ప్రతినిధి, డిసెంబర్ 26 (విజయక్రాంతి): ప్రపంచ సినిమా వేదికపై తెలుగువారి భాగస్వామ్యాన్ని మరింత పెంచే దిశగా అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగువేసింది. ప్రజలకు వినోదం పంచే వెండితెరకు మరి న్ని వెలుగులు అద్దేందుకు, తద్వారా ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించేందుకు ఎప్పుడూ సిద్ధమేనన్న విషయాన్ని పునరుద్ఘాటించింది రేవంత్ సర్కార్.
అంతి మంగా సగటు మనిషికి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటుందన్న విషయా న్ని స్పష్టం చేసింది. గురువారం టాలీవుడ్ పెద్దల భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలను పరిశీలీస్తే, ప్రభుత్వ లక్ష్యం ఎమిటో స్పష్టంగా అర్థమవుతుం ది. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొ ని, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలన్నది తాత్పర్యం.
‘పుష్ప2’ బెనిఫిట్ షో ఘటన తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండద న్న సంగతిని రేవంత్‌రెడ్డి తాజా భేటీ సందర్భంలోనూ వెల్లడించినట్టు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తమతో షేర్ చేర్ చేసుకున్నారంటూ ఎఫ్‌డీసీ చైర్మన్ చెప్పడం తెలుగు సినిమా పరిశ్రమకు మంచి రోజు లు రానున్నాయనేది ఖాయంగా కనిపిస్తోం ది.
హైదరాబాద్‌ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్‌గా మార్చే దిశగా సర్కారు అడుగులు వేయనుందని తెలుస్తోంది. ఇటీవలి సంఘటనల నేపథ్యంలో పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరిగిందనేది అపోహ మాత్రమేనని తేలిపోయింది.
ప్రభుత్వ నిర్ణయాలతో దిగివచ్చిన ‘పుష్పరాజ్’
సంధ్య థియేటర్ ఘటన, తదనంతర పరిణామాలను బట్టి చూస్తే ప్రభుత్వం పైచేయి సాధించినట్టు అర్థమవుతోంది. అన్ని రంగా ల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక విజన్‌తో ముందుకు సాగుతున్నందునే ఇటీవల ఘటనల విషయంలో కఠినంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
‘పుష్ప2’ బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన నష్టానికి బాధ్యత వహించేందుకు సదరు సినిమా నటుడు, నిర్మాతలు ముందుకు రావడం వెనుక ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలే కారణమని చెప్పాలి. ఘటన జరిగిన తర్వాత విమర్శలు తీవ్రమైతే తప్ప నటుడు అల్లు అర్జున్ కానీ, నిర్మాతలు కానీ స్పందించలే దు.
అల్లు అర్జున్ తొలుత బాధిత కుటుంబానికి కేవలం రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించి చేతులు దులుపుకున్నారు. పోలీసు విచారణలో తెలిసిన వివరాల ఆధారంగా ముఖ్యమంత్రి రేవంత్ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. మూవీ టీమ్, థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ అసెంబ్లీ సాక్షిగా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు.
థియేటర్ వద్ద ఏం జరిగిందనేది మీడియా సైతం కళ్లకు కట్టినట్టు బహిర్గతం చేసింది. నిర్మాతలు, నటుడిపై ప్రజల నుంచి విమర్శల తాకిడి పెరిగింది. చేసేది లేక నిర్మాతలు, హీరో బాధిత కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ‘పుష్పరాజ్’ దిగిరాక తప్పలేదు.
ఫలితంగా శ్రీతేజ్ కుటుంబానికి మేకర్స్ నుంచి కథానాయకుడి నుంచి మొత్తంగా రూ.2 కోట్లు ఆర్థిక సహాయం అందేలా మార్గం సుగమమైంది. డైరెక్టర్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు ఇచ్చేందుకు ముందుకు రాగా, హీరో రూ.కోటి సహాయాన్ని అందించేందుకు ఒప్పుకున్నారు. ఇలా బాధిత కుటుంబానికి న్యాయం చేకూరే క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు ఫలించాయని చెప్పొచ్చు.
పాలకులదే పైచేయి
సినిమా పెద్దలంతా కట్టకట్టుకొని సర్కారుతో ములాఖత్‌కు రావడం చూస్తే ఎప్పుడైనా పాలకులదే పైచేయి అని స్పష్టమవుతోంది. నిండు సభలో సినీ పరిశ్రమ పై పాలకులు తీసుకున్న నిర్ణయాలను మార్చే ప్రయత్నం ఎవరూ చేయలేరని తాజా భేటీ తేల్చేసింది. ఇటీవలి ఘటనల దృష్ట్యా బెనిఫిట్ షోలు ఇకపై ఉండవని, టికెట్ ధరల పెంపునకు అవకాశం కల్పించలేమని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు.
యువతను పెడదోవ పట్టించే, సంఘ వ్యతిరేక కార్యకపలాపాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో సినీ పరిశ్రమ బాధ్యతగా వ్యవహరించాలంటూ ప్రభు త్వ నిర్ణయాలూ సబబేనని తెలుస్తోంది. సినిమాలతో డబ్బులు సంపాదించుకునే క్రమంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించేవాళ్లకు తాజా పరిణామాలు చెప్ప పెట్టు లాంటిది. సినీమా పలుకుబడితో రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి, తద్వారా ప్రభుత్వాలను శాంసించవచ్చన్న భ్రమలో ఉన్నవారికి ఇదొక గుణపాఠం.