వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ వైల్స్
అటార్నీ జనరల్‌గా మైక్ లీ?
మస్క్‌కూ కీలక బాధ్యతలు ట్రంప్ 2.0లో మనోళ్లకూ చాన్స్
వాషింగ్టన్, నవంబర్ 8: అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అఖండ విజయం సాధించి మరోసారి అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎక్కబోతున్నారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే ఆయనకు సమర్థమైన కార్యవర్గం అవసరం. ప్రమాణానికి ఇంకా 70 రోజులకుపైగా సమయం ఉన్నందున టీమ్ కూర్పుపై ట్రంప్ దృష్టిపెట్టనున్నారు. జనవరి నాటికి పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ టీంపై అమెరికా మీడియా అంచనాలు వేస్తోంది.
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా సూసీ
రిపబ్లికన్ల ప్రచారంలో కీలకంగా వ్యవహరించిన పార్టీ క్యాంపెయిన్ మేనేజర్ సూసీ వైల్స్‌ను వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా నియమి స్తున్నట్లు ట్రంప్ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో సూసీ అమెరికా చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన కార్యవర్గ సభ్యుల పేర్లను కూడా ట్రంప్ ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాతే పేర్లను ప్రకటించనున్నట్టు ట్రంప్ సీనియర్ సహాయకుడు జాసన్ మిల్లర్ పేర్కొన్నారు. ట్రంప్ నూతన కార్యవర్గంలో పాతవారితోపాటు కొత్తవారూ ఉంటారని తెలిపారు.
ఎలాన్ మస్క్
ట్రంప్ గెలుపులో ముఖ్యత్ర పోషించిన కుబేరుడు ఎలాన్ మస్క్‌ను తన క్యాబినెట్‌లోకి తీసుకునే ఆలోచనను ట్రంప్ బయటపెట్టారు. ‘సెక్రటరీ ఆఫ్ కాస్ట్ కట్టింగ్’గా నియమించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు పేర్కొన్నారు. విజ యానంతరం కూడా మస్క్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
స్కాట్ బెసెంట్
బిలియనీర్ స్కాట్ బెసెంట్ ఎన్నికల సమయంలో ట్రంప్‌కు ప్రధాన సలహాదారుడిగా ఉన్నారు. పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. స్కాట్‌కు టెజరీ సెక్రటరీగా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం నడుస్తోంది.
రిక్ గ్రెనెల్
‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అమలు చేయడంలో విదేశాంగశాఖ ముఖ్య పాత్ర పోషిస్తుం ది. అమెరికాకు ప్రయోజనం చేకూరేలా పలు దేశాలతో ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటు ంది. ఈ బాధ్యతలను రిక్ గ్రెనెల్‌కు అప్పగిస్తూ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా నియమించే అవకాశం ఉంది. లేదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమించే అవకాశం ఉంది.
మైక్ లీ
అమెరికాలో కీలక పదవులలో అటార్నీ జనరల్ కూడా ఒకటి. పాలసీల విషయంలో ట్రంప్‌కు ఎదురయ్యే చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సమర్థమైన వ్యక్తి అవసరం. ఈ నేపథ్యంలో మైక్‌కు ఏజీ బాధ్యతలు అప్పగించేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. ఈ పదవి కోసం ఎరిక్ స్మిత్, జాన్ రాట్‌క్లిఫ్ పోటీ పడుతున్నారు.
సీఐఏ అధిపతిగా కశ్యప్ పటేల్
ప్రపంచలోనే అత్యంత శక్తిమంతమైన నిఘా సంస్థ సీఐఏకు భారతీయ మూలాలు ఉన్న కశ్యప్ పటేల్‌ను నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ట్రంప్ నమ్మిన బంటుల్లో ఈయన ఒకరు. కశ్యప్ మూలాలు గుజరాత్‌లో ఉన్నాయి. రక్షణ విషయంలో ట్రంప్ ప్రాధాన్యతలు కశ్యప్‌కు తెలుసు. అందువల్ల ఆయనను సీఐఏగా నియమిస్తారనే ప్రచారం నడుస్తోంది.
హెల్త్ సెక్రటరీగా బాబీ జిందాల్
బాబీ జిందాల్‌ను ట్రంప్ తన కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. హెల్త్, హ్యూ మన్ సర్వీసెస్ సెక్రటరీగా అవకాశం లభించనుంది. ప్రస్తుతం జిందాల్ సెంటర్ ఫర్ ఎ హెల్తీ అమెరికాకు అధిపతిగా ఉన్నారు. లూసియానా గవర్నర్‌గా అనుభవం ఉండటంతో ట్రంప్ టీంలో చోటు దక్కే అవకాముంది.
నిక్కీ హేలీకి అవకాశం
భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ. గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా పని చేశారు. ట్రంప్ హయాంలో ఐరాసలో అమెరికా రాయబారిగా ఆమె వ్యవహరించారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక న్ అభ్యర్థిత్వం కోసం ట్రంప్‌తో పోటీ పడ్డారు. కానీ తర్వాత వెనక్కి తగ్గి ట్రంప్‌కు మద్దతు తెలిపారు. నిక్కీ హేలీకి ట్రంప్ కార్యవర్గంలో చోటు అవకాశం ఉందంటున్నారు. వివేక్ రామస్వామికి కూడా ట్రంప్ టీంలో బెర్త్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.