calender_icon.png 29 October, 2024 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామన్ మ్యాన్ కథ ఇది

29-10-2024 12:05:45 AM

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లక్కీభాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి సోమవా రం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

“బ్యాంకింగ్ నేపథ్యంలో కుటుంబ భావోద్వేగాలను ముడిపెడుతూ దర్శకుడు ఈ కథ రాసిన విధానం నచ్చింది. ఇదొక కామన్ మ్యాన్ కథ. ఇందులో నేను చేసిన ఈ సుమతి పాత్ర ప్రేక్షకులకు చేరువవుతుందనే నమ్మకం ఉంది. భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బతకడానికి అవసరమైనంత డబ్బుంటే చాలు అనుకునే స్వభావం తనది.

దురాశ, డబ్బు కారణంగా భాస్కర్- సుమతి మధ్య ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ‘గుంటూరు కారం’ తర్వాత సితార ఎంటెర్‌టైన్‌మెంట్స్‌లో ఇది నా రెండో సినిమా. బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమాని ప్రారంభించడం వల్ల నాది, దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఇబ్బందిపడలేదు. వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు.

పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపించాలనుకుంటున్నా. నేను మొదటిసారి తల్లి పాత్ర పోషించా. ఇది నాకు కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది. నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయా. ఈ సినిమాతో నాకు నటిగా మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నా. ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేశ్ రావిపూడి గార్ల సినిమాలో నటిస్తున్నా. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి” అన్నారు.