“చదువుకు తగ్గ జాబ్ లేదు. జాబ్‌కి తగ్గ జీతం లేదు. కట్టిన టాక్స్‌కి తగ్గ ఫెసిలిటీస్ లేవు. దొంగిలించే వాడు దొంగిలిస్తూనే ఉంటాడు. తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు” ఇలా ప్రతినిత్యం ఎంతో మంది అసహనంతో రగిలిపోతుంటారు. ఎదిరించే తెగువ లేక అరుపులకే పరిమితమైన అలాంటి వాళ్ళకు అక్రమార్కులను హడలెత్తించే ఓ హంటింగ్ డాగ్ ఉందని తెలిస్తే.. గొంతెత్తి పిలవకుండా ఉంటారా? ‘భారతీయుడు 2’లో ఇదే జరిగింది. జనమంతా ఏకమై ‘కమ్ బ్యాక్ ఇండియన్’ అని పిలుపునివ్వడంతో స్వతంత్ర పోరాట యోధుడైన ‘సేనాపతి’ తిరిగొచ్చాడు.
అక్రమాలను, అవినీతిని ఇక ఎంత మాత్రం సహించేది లేదంటూ ‘జీరో టోలరెన్స్’ అని నినదించాడు. ఆ తర్వాత ఏం జరిగిం ది..? అన్నది తెరపై చూడండి అంటున్నారు దర్శకుడు శంకర్. కమల్ హాసన్ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ జూలై 12న థియేటర్లలోకి రానున్న విష యం విధితమే. కాగా ఈ చిత్ర ట్రైలర్ మంగళవారం విడుదలైంది. “ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు.. నేతాజీ మార్గంలో నేను” అంటూ కమల్ చెప్పిన మాటలు, చేసిన పోరాటాలు సినిమాకి ఆకర్షణగా మారాయి. ట్రైలర్‌ని బట్టి భారతీయుడు ఈసారి దేశ సరిహద్దులు దాటినట్టు తెలుస్తోంది. సిద్దార్థ్, ఎస్.జె.సూర్య, నెడుమూడి వేణు, వివేక్, బాబీ సింహ, రకుల్‌ప్రీత్ తదితర తారాగణంతో లైకా ప్రొడక్షన్స్, రెడ్ గెయింట్ మూవీస్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ స్వరకర్త.