calender_icon.png 19 January, 2025 | 2:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో పడిపోకుండా కాపాడిన సినిమా ఇది

18-01-2025 12:00:00 AM

‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్‌లో నిర్మాత శిరీష్

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పొంగల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పొంగల్ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించింది. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో హీరో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘కష్టపడి పని చేస్తే ఫలితం వస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ విజయం మరోసారి రుజువుచేసింది. ఇది తెలుగు ఆడియన్స్, ఫ్యాన్స్ సక్సెస్’ అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ.. ‘భాగ్యం క్యారెక్టర్ నాకు చాలా కొత్త. ఈ క్యారెక్టర్ క్రెడిట్ అంతా అనిల్‌కే దక్కుతుంది’ అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘రాజు గారు, శిరీష్ గారు నన్ను దర్శకుడిగా నిలబెట్టిన నిర్మాతలు. ఇప్పటివరకు నేను తీసిన ఎనిమిది సినిమాల్లో ఐదు కంటిన్యూగా వందకోట్ల గ్రాసర్స్. ఆఖరి ఐదు సినిమాలు యూఎస్‌లో వన్ మిలియన్ గ్రాసర్స్. ఒక దర్శకుడిగా ఆడియన్స్‌కు ఎంత థాంక్ ఫుల్‌గా ఉండాలో అర్థం కావడం లేదు. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనం.’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘లైఫ్‌లో హిట్స్ ఫ్లాప్స్ క్లాసిక్స్ బ్లాక్ బస్టర్స్ అన్నీ చూశాం.

ఈ సినిమా మేము ఊహించని మహా అద్భుతం. ఈ సంక్రాంతిని మర్చిపోలేం. వెంకటేశ్ నిర్మాతల హీరో. హీరో నిలబడినప్పుడే ఇలాంటి ప్రమోషన్స్ పాజిబుల్ అవుతాయి. ప్రతి డైరెక్టర్ ఇలాంటి కొత్త థాట్స్‌తో ప్రమోషన్స్ చేస్తే ఎంత అద్భుతం జరుగుతుందో అనిల్ మరోసారి ప్రూవ్ చేశారు’ అన్నారు. నిర్మాత శిరీష్ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్ హరికి థాంక్స్ చెప్పాలి. ఆ రోజు ఆయన పటాస్ సినిమా చూపించకపోతే ఈరోజు అనిల్‌తో జర్నీ ఉండేది కాదు.

అప్పుడు మా కాంపౌండ్‌లోకి వచ్చిన అనిల్‌ను మేం బయటకు పోనీయడంలేదు. ఆయన లేకపోతే ఈరోజు మేము లేము. ఈ సినిమా మీ మొత్తం సమస్యను పరిష్కరిస్తుందని అనిల్ షూటింగ్‌లో చెప్పేవాడు. మేము బావిలో పడిపోతున్నామని ఎంతో మంది సంతోషపడేలోపు ఈ సినిమా మమ్మల్ని పక్కన పడేసింది. ఆ క్రెడిట్ అనిల్‌కే దక్కుతుంది’ అన్నారు. ఇంకా ఈ సక్సెస్ మీట్‌లో నటుడు అవసరాల శ్రీనివాస్, చిత్రబృందం మాట్లాడి తమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకున్నారు.