calender_icon.png 7 November, 2024 | 3:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇదేం ప్రయాణం!

19-04-2024 12:10:00 AM

దేశంలోనే అత్యంత రద్దీ నగరాల్లో ఒకటైన బెంగళూరులో ఓ జంట ద్విచక్ర వాహనంపై ఎంత ప్రమాదకరంగా ప్రయాణం చేస్తూ ఉందో సోషల్ మీడియాలో  వైరల్ కావడం ద్వారా వెలుగులోకి వచ్చింది. 

భార్యాభర్తలు స్కూటీపై కూర్చుని ఉంటే పక్కనే వాళ్ల బిడ్డ ఫుట్‌రెస్ట్‌పైన నిలబడి ఉన్నాడు. రాత్రిపూట రద్దీగా ఉండే రోడ్డుపై ఏదయినా గుంత లాంటిది ఉండి బైక్ దానిలో పడితే చిన్న పిల్లాడు ఎగిరి పడే ప్రమాదం ఉంది. అదేమీ పట్టనట్లుగా ఆ జంట ప్రయాణం చేస్తుండడం చూసిన ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇంకేముంది, నెటిజన్లు ఆ జంటపై రకరకాల కామెంట్లు చేస్తూ ఓ ఆటాడుకున్నారు. చివరికి ట్రాఫిక్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.

ప్రతి రోజూ ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్నో విలువైన ప్రాణాలు పోతున్నా వాహనదారుల నిర్లక్ష్యం మాత్రం పెరుగుతూనే ఉంది. ఇద్దరు ప్రయాణించడానికి పరిమితమైన ద్విచక్ర వాహనాలపై ముగ్గురు, అప్పుడప్పుడు నలుగురు కూడా ప్రయాణించడం చూస్తూనే ఉన్నాం. ఏదయినా ప్రమాదం జరిగితే ఆ వాహనంపై ప్రయాణించే అందరి ప్రాణాలకు ముప్పేనన్న విషయం వారికి తెలిసినా అదేమీ పట్టనట్లు ప్రవర్తిస్తుంటారు.  

బెంగళూరులో భారీ జరిమానా

బెంగళూరులోనే ఓ మహిళ నిర్వాకం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోక తప్పదు. ఆమె ఏకంగా 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు అక్కడి నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్.. ఇలా అనేక ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆమెకు ఏకంగా రూ.1.36 లక్షలు జరిమానా విధించినట్లు వారు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఆ మహిళ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు వీడియోలు రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు పెండింగ్‌లో ఉన్న చలానాలు, జరిమానాలు కలిపి లక్షా 36  వేల రూపాయలు కట్టాల్సిందిగా ఆమెకు వరస నోటీసులు పంపారు. గతంలో కూడా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగానే జరిమానాలు విధించారు. అయినా, ప్రజల్లో మార్పు రావడం లేదని నగర పోలీసు జాయింట్ కమిషనర్  ఎంఎన్ అనుచేత్ ఆవేదన వ్యక్తంచేశారు. పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇటీవల ఓ ద్విచక్ర యజమానిపై కేసు నమోదు చేయడంతోపాటు రూ.3.2 లక్షల జరిమానా విధించినట్లు ఆయన చెప్పారు. 

ఇది ఒక బెంగళూరు నగర సమస్యే కాదు. దేశంలోని అన్ని నగరాల్లోను ఇదే తంతు. ట్రాఫిక్ నిబంధనలు ఉండేది తమ రక్షణ కోసమేననే విషయాన్ని  వాహనదారులు గ్రహిస్తే ఇలాంటి పరిస్థితులు రావు.