calender_icon.png 10 January, 2025 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాటకు దక్కిన గౌరవం ఇది!

05-01-2025 12:13:20 AM

విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు భీమ్స్ శనివారం మీడియాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భీమ్స్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... 

అనిల్ గారితో కలిసి పనిచేయడం సందడిగా, సంతోషంగా ఉంటుంది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే.. అనిల్ గారికి సాహిత్యం, సంగీతంపై ఉన్న అభిరుచే కారణం. 

దిల్ రాజు గారు నా పాటకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చారు. ఇండస్ట్రీలో ఓ చరిత్ర ఉన్న బ్యానర్‌లో నాకు అవకాశం రావడం గర్వంగా ఉంది. ఇంతకుముందు దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో ‘బలగం’ సినిమాకు సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇదంతా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ప్రజలతో మమేకమై, వాళ్లకు ఏం కావాలో వాళ్ల దగ్గర నుంచే తీసుకొని తిరిగి వాళ్లకే ఇస్తున్నాను. 

వెంకటేశ్ గారిని నేరుగా చూసింది కూడా లేదు. అలాంటిది ఆయన సినిమాకు వర్క్ చేస్తున్నానని తెలియగానే చిన్నప్పటి నుంచి చూసిన ఆయన సినిమాలు, పోస్టర్లు కళ్ల ముందు రీల్స్‌లా తిరిగాయి. ఈ అవకాశం దేవుడి దయగా భావిస్తున్నాను. ఇందులో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ స్వయంగా వెంకటేశ్ గారు తనంతట తానే వచ్చి పాడారు.. సంగీత దర్శకుడిగా ఇది నాకో ఎచీవ్‌మెంట్. వెంకటేశ్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు ‘సంక్రాంతికి వస్తున్నాం’.

రమణ గోగుల గారిని అజ్ఞాతంగా ఆరాధిస్తూ వచ్చినవాడిని. నేను లిరిక్ రైటర్‌గా ఉన్నప్పుడు ఆయన పాటకు రాయాలనుకున్నాను. ఆయన ఈ సినిమాలో ‘గోదారి గట్టు’ సాంగ్ పాడతానని ఒప్పుకోవడం చాలా లక్కీ. పాట విని ఇందులో సోల్ ఉందన్నారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఆయన ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకు, ఆయన పాటకు పాదాభివందనం. పాటలన్నీ ట్యూన్ చేసిన తర్వాతే రైటర్స్ లిరిక్స్ రాశారు.