న్యూఢిల్లీ: జాతీయ జట్టుకు ఎంపికయ్యాననే విషయం తెలియగానే చాలా ఆనందం వేసింది. నా కెరీర్ ఈ స్థాయికి వచ్చేందుకు నాన్న పడ్డ కష్టమంతా కండ్ల ముందు తిరిగింది. అయితే దీంతోనే సంతృప్తి పడేది లేదు. ఇప్పడు కేవలం 50 శాతం మాత్రమే నా కల నెరవేరింది. భారత జెర్సీ వేసుకొని.. దేశం కోసం విజయాలు సాధించినప్పుడే పూర్తి సంతృప్తి లభిస్తుంది. నా నైపుణ్యంపై నమ్మకముంచి నన్ను ప్రోత్సహించిన నాన్న ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్లందరి దృష్టిలో మా నాన్న గౌరవం పెంచే విధంగా ఆడు తా. నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు మా కుంటుంబం విశాఖపట్నంలో నివాసం ఉండేది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన నాన్న కు వేరే రాష్ట్రానికి బదిలీ అయింది.
అయితే ఆ ప్రాంతంలో క్రికెట్ కోచింగ్ సరిగ్గా లేదని తెలుసుకున్న నాన్న ట్రాన్స్‌ఫర్‌కు నిరాకరించడంతో పాటు.. ఉద్యోగానికి రాజీనా మా చేశారు. దీంతో బంధువులు, స్నేహితులతో పాటు ఇరుగుపొరుగు వారు నాన్నను నానా మాటలు అన్నారు. పనికిమాలిన ఆట కోసం బంగారం లాంటి ఉద్యోగం వదులుకుంటున్నావు అని మందలించారు. అయినా నా ట్యాలెంట్‌పై నమ్మకమున్న నాన్న ఉద్యోగం వదిలేసి నా కోచింగ్‌పై దృష్టి పెట్టారు. చిన్నప్పుడే ఇవన్నీ తెలిసిన నేను.. ఆ రోజు మనసులో గట్టిగా సంకల్పం తీసుకున్నా. ఏదో ఒక రోజు జాతీయ జట్టుకు ఎంపికై నాన్నను అవమానించిన ప్రతి ఒక్కరికి గట్టిగా బదులివ్వాలని. అది ఇన్నాళ్లకు సాధ్యమైంది. కెరీర్ ఆరం భంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యేవి.
జూనియర్ లెవల్‌లో ఒకే బ్యాట్‌తో సీజన్ మొత్తం ఆడేవాడిని. కశ్మీర్ విల్లో బ్యాట్ స్వీట్ స్పాట్‌ను కాపాడుకునేందుకు టేపులు వేసి దానికి మరామ్మత్తులు చేసుకునేవాడిని. నిరుడు జాతీయ సెలెక్టర్లు అండర్ ఎమర్జింగ్ కప్‌కు ఎంపిక చేయడంతో నాలో మరింత పట్టుదల పెరిగింది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా ఎక్కువ అవకాశాలు రాకపోయినా.. అది నన్ను నేను మార్చుకునేందుకు బాగా దోహదపడింది. ఆ టోర్నీ తర్వాత దాదాపు రెండు నెలల పాటు రాత్రీపగలు కష్టపడ్డా. గంటల తరబడి నెట్స్‌లో త్రోడౌన్స్ ఆడేవాడిని 2023 ఐపీఎల్ కూడా అంత గొప్పగా ఏమీ సాగలేదు.
అయితే ప్రాక్టీస్ మాత్రం వీడలేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు తరఫున ఫినిషర్ రోల్ పోషించడం బాగా కలిసొచ్చింది. 13 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టా. క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్ చేసి రాణించడంతో మంచి పేరొచ్చింది. ఐపీఎల్ 17వ సీజన్‌లో 21 సిక్సర్లు బాదా. అందులో చెన్నైపై కొట్టిన సిక్స్ నాకు బాగా ఇష్టం. కేవలం బ్యాటింగ్ మాత్రమే కాకుండా బౌలింగ్‌పై కూడా దృష్టి పెట్టా. సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్, క్లాసెన్, భువనేశ్వర్ ఎంతో సహక రించారు.