19-03-2025 12:21:42 AM
మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి
పెన్ పహాడ్, మార్చి 18: రైతులకు సాగునీరు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రేస్ ప్రభుత్వమని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం దుబ్బతండా, మెగ్య నాయక్ తండాలల్లో పర్యటించిన ఆయన ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో మాట్లాడి వారి కష్టాలను, పంట నష్టాలను అడిగి తెలుసుకు న్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చేతగాని చావలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదన్నారు. రైతులు పంట పొలాల ఎండిపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. రైతు సమస్యలపై ప్రశ్నిస్తే, వాస్తవాలు మాట్లాడితే అకారణంగా బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారన్నారు. ప్రభుత్వ తనను ఏదో భయపెట్టాలని చూస్తోందని, జగదీశ్ రెడ్డి భయపడే వ్యక్తి కాదన్నారు.
పోరాటం చేసే వ్యక్తినని, కద్ద పెద్ద రాకాసులతోనే పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. నిఖార్సయిన ఉద్యమకా రుడనని, ఎవ్వరికీ భయపడనని తెలిపారు. యావత్ ప్రభుత్వం కుట్రజేసి అసెంబ్లీ నుంచి బయటికి పంపారని తెలిపారు. మళ్లీ రైతుల వద్దకే వచ్చానని, రైతులతోనే మాట్లాడుతున్నానని, రైతుల బాధలు అడిగి తెలుసుకుంటున్నాని తెలిపారు.
ఇవ్వాళ ఊళ్లు కళ తప్పాయని, గ్రామాలలో ప్రజల ముఖాల్లో చిరునవ్వు మాయమైనదని అన్నారు. ఎవరు ప్రశ్నిస్తే వారి పైన కేసులు పెట్టడం, నిర్బంధించడం, భయపెట్టడం కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాకు అప్పగించి చూడు, మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని తెలిపారు.