calender_icon.png 21 March, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను అమలు చేసే బడ్జెట్ కాదిది..

20-03-2025 01:30:00 AM

బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా లేదని బీజేఎల్పీ ఉప నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో అంకెలకు ఎక్కడా పొంతన లేదని దుయ్యబట్టారు. రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ సోకిందని ఇప్పటికే సీఎం ప్రకటించారని, బడ్జెట్‌ను చూస్తే అదే నిజమని అనిపించిందని ఎద్దేవా చేశారు. పద్దు ఏ ఒక్క వర్గాన్నీ సంతృప్తపర్చలేదని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్న పథకాలనే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి అసెంబ్లీలో వల్లె వేశారని ఆరోపించారు.

ప్రజానీకంతో ఎక్కువ మద్యం తాగించి, సొమ్ము రాబట్టాలని సర్కార్ చూస్తోందని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం పద్దులో రూ. 20వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, ఇప్పుడు మొండిచేయి చూపడం సిగ్గుచేటన్నారు. పంట బీమా కోసం నయాపైసా అయినా కేటాయించకపోవడం రైతులకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ గంగలో కలిసిందని ధ్వజమెత్తారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంచామని చెప్తున్న సర్కార్, ఆ కార్డులను ప్రైవేటు ఆసుపత్రులు పట్టించుకోకపోవడాన్ని మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పద్దులో హైదరాబాద్ అభివృద్ధి ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.