calender_icon.png 31 October, 2024 | 4:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇది బ్లాక్‌మెయిల్

25-07-2024 01:00:40 AM

బడ్జెట్‌పై అసెంబ్లీలో కేంద్రాన్ని తిట్టేందుకే రేవంత్ చర్చ

ఢిల్లీ దీక్షల పేరుతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కూడబలుక్కున్నాయి

మండిపడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టి తీర్మానాలు చేయడం కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడమేనని, కేంద్రాన్ని తిట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చ పెట్టినట్లుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ తన తప్పి దాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ కారణంగానో, కేసీఆర్ దయ వల్లో బీజేపీ తెలంగాణలో గెలవలేదన్నారు.

ఢిల్లీలో దీక్షలంటూ బీఆర్ ఎస్, కాంగ్రెస్ కూడబలుక్కున్నాయని ఫైర్ అయ్యారు. హామీలు అమలు చేయాలని అడిగితే కుంటిసాకులు చెబుతున్నారని కాంగ్రెస్ సర్కారుపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీకి 35 శాతం ఓట్ షేర్ వచ్చిందని.. నీతి ఆయోగ్‌ను బహిష్కరిస్తామనడాన్ని సీఎం రేవంత్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్ నాయకులు దివాళా తీయించారన్నారు.

రేవంత్ రెడ్డి కూడా అహంకారపూరితమైన కేసీఆర్ మార్గం లో వెళ్తున్నాడనిఆరోపించారు. కాంగ్రెస్ నాయకులను, సోనియా కుటుంబాన్ని కలిసేందుకే రేవంత్‌రెడ్డి అనేకసార్లు ఢిల్లీ వచ్చారని అన్నారు. రెండు పార్టీల నేతలు పోటీపడి మోదీని విమర్శిస్తున్నారని.. అవినీతి, అసమర్థత తో పాలన చేతకాక కేంద్రం మీద విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర నిధులను రాష్ర్ట ప్రభుత్వం దారి మళ్లిస్తోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను కూడా దారి మళ్లించారన్నారు. 

కేంద్రం పదేళ్లలో రాష్టానికి రూ. 10 లక్షల కోట్లు కేటాయించింది

కేంద్రం పదేళ్లలో రాష్టానికి రూ. 10 లక్షల కోట్లు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల కోసం కేంద్రం రూ.6లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పునర్విభజన చట్టం కింద అనేక హామీలు అమలు చేశామన్నారు. రామగుండంలో రూ. 10,990 కోట్లతో విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఓవరాలింగ్ ఫ్యాక్టరీకి ప్రధాని శంకుస్థాపన చేశారన్నారు. గిరిజన వర్సిటీ కోసం కేంద్రం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. జీఎస్టీ పరిహారం కింద రూ.7 వేల కోట్లను రాష్ట్రానికి అందజేశామన్నారు. రామగుండంలో రూ. 6,300 కోట్లతో ఫర్టిలైజర్ కంపెనీని ఏర్పాటు చేశామన్నారు. 

ఏఐసీసీ స్క్రీన్ ప్లే ఆధారంగా దేశవ్యాప్తంగా ధర్నాలు నడుస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోని 33 జిల్లాలకు 33 వేర్వేరు ప్రాజెక్టులుగా చూపి బడ్జెట్‌లో కేటాయింపులు చేస్తారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలోనే నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. కేసీఆర్ గజ్వేల్- డెవలప్‌మెంట్ అథారిటీ పెడితే... రేవంత్ రెడ్డి కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ పెట్టుకున్నాడని మరి గద్వాల, నాగర్‌కర్నూల్ డెవలప్‌మెంట్ అథారిటీలు కూడా ఎందుకు పెట్టడంలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తమకు 35 శాతం ఓట్లు వచ్చాయని జీర్ణించుకోలేకే ఇలా మాట్లాడుతున్నారని, రానున్న రోజుల్లో తెలంగాణ కోసం మరింత చిత్తశుద్ధితో పనిచేస్తామని తెలిపారు.