calender_icon.png 12 March, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇటు శిథిలం..అటు భూమిపూజ

12-03-2025 12:35:08 AM

  1. జిల్లా వ్యాప్తంగా 1,342 నిర్మాణ దశలో ఆగిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 
  2. 5440 డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తి 
  3. డబుల్ బెడ్ రూమ్‌లో మౌలిక సదుపాయాల నిమిత్తం రూ.20 కోట్ల 10 లక్షలు మంజూరు 
  4. నిర్మాణ దశలో ఉన్న డబుల్ ఇండ్లను పూర్తి చేయాలంటున్న ఆయా గ్రామాల ప్రజలు
  5.  ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ మంచిదే... నిర్మాణ దశలో ఉన్న ఇండ్ల పూర్తి ఎప్పుడు ? 
  6. అంతర్లింగానే చర్చ ఊపందుకున్న వైనం 
  7. త్వరలోనే నిర్మాణ దశలో ఆగిన ఇండ్ల లో పనులు ప్రారంభిస్తాం: వైద్యం భాస్కర్, జిల్లా హౌసింగ్ శాఖ, ఈఈ 

మహబూబ్ నగర్ మార్చి 11 (విజయ క్రాంతి) : ప్రభుత్వం ఏదైనా ప్రజా సంక్షేమానికి కట్టుబడి పని చేస్తున్నామని చెబుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రభుత్వాలు ప్రజల మన్ననలూ పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటాయి.

ఈ విధానము నాటి నుంచి నేటి వరకు కొనసాగుతుంది. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు కావాల్సింది వారి సంక్షేమం మాత్రమే.  ఈ క్రమంలోనే గత బిఆర్‌ఎస్ ప్రభుత్వము డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కాగా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఇండ్లు నిర్మాణాలు  ఆగిపోయాయి.

ఇది ఇలా ఉండగా ప్రస్తుత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఇక్కడ వరకు బాగానే ఉన్నా గతంలో నిర్మాణ దశలో ఆగిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తే మరింత బాగుంటుందని ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. 

ఓవైపు శిథిలావస్థకు... మరోవైపు శ్రీకారమా..?

మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఎనిమిది వేల పైచిలుకు ఇండ్ల నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ వివిధ కారణాలవల్ల 6782 ఇండ్ల నిర్మాణం చేసేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ దశలో ఈ ఇండ్లన్నీ ప్రారంభమైనప్పటికీ 5440 ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. మరో 1342 ఇండ్లు జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇందిరమ్మ ఇండ్ల శ్రీకారం చుట్టడంతో పాటు అదే గ్రామాలలో నిర్మాణంలో ఉండి ఆగిపోయిన ఇండ్లలలో పనులు ప్రారంభిస్తే మరింత బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. ఈ ప్రక్రియ రెండు ఒకే మారు ప్రారంభమైతే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు. కొన్ని గ్రామాలలో గత ప్రభుత్వం ప్రారంభించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.

అదే గ్రామంలో ప్రస్తుత ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల పేరిట నూతన ఇండ్లకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. తక్కువ మొత్తం ఖర్చు చేస్తేనే ఆ ఇండ్లు పూర్తయ్యే అంశం ఉండడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ ఇండ్లను పూర్తి చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల ను నిర్మిస్తే మరింత బాగుంటుందని ప్రత్యేకంగా చెబుతుండ్రు. 

రంగారెడ్డి గూడలోనూ అంతే..

జడ్చర్ల ఎమ్మెల్యే సొంత గ్రామమైన రంగారెడ్డిగూడెంలో ఓవైపు గతి ప్రభుత్వం నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రభుత్వం ఏదైనా ప్రజల సంక్షేమం కోసమే అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని శిథిలావస్థకు చేరుకుంటున్న ఈ ఇళ్లను కూడా వెంటనే ప్రారంభించి ఇండ్లు లేని నిరుపేదలకు అందిస్తే బాగుంటుందని ఆ గ్రామాల ప్రజలు కోరుతు న్నారు.

రంగారెడ్డిగూడెంలో ఇటీవల జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ అంశం మంచిదైనప్పటికీ నిర్మాణ దశలో ఆగిపోయిన ఇండ్లను కూడా పూర్తి చేస్తే బాగుంటుందని పలు చర్చలకు దారితీస్తుంది. 

గత ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకే...ఈ ప్రభుత్వం అన్ని ప్రాంతాలలో శ్రీకారం 

గత ప్రభుత్వము డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఆశించిన మేరకు జరగడం లేదని విమర్శలు ఉన్న విషయం విదితమే. జిల్లా వ్యాప్తంగా 441 గ్రామాలు ఉండగా దాదాపుగా 41 ప్రాంతాల్లో మాత్రమే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది.

ఈ అంశం సంతోషించినప్పటికీ నిర్మాణ దశలో ఉన్న ఇండ్ల పూర్తి ఎంతో  ప్రాముఖ్యత గల అంశముగా ప్రస్తుత ప్రభుత్వం చూడవలసిన అవసరం ఉంది. ఇందుకు ఇప్పటికే కొంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడంతో పాటు తక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తేనే ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వినియోగంలోకి రానున్నాయి. 

ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి

జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో 1342 ఇండ్లు నిర్మాణ దశలో ఆగిపోయిన విషయం నిజమే. ప్రభుత్వము నిర్మాణ దశలో ఆగిపోయిన ఇండ్లన్నిటిని పూర్తిచేసేందుకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే నిర్మాణ దశలో ఉన్న ఇండ్లలో పూర్తిస్థాయిలో పనులు చేపడతాం. నిర్మాణం పూర్తయి డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో  మౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ 20 కోట్ల 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది. పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి అంశంను ప్రత్యేకంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నాం. 

 వైద్యం భాస్కర్, జిల్లా హౌసింగ్ శాఖ ఈ ఈ