calender_icon.png 9 January, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ-రేస్ కేసు.. లొట్టపీసు కేసు

09-01-2025 12:08:41 AM

  1. పైసా అవినీతి జరలేదు.. నేను తప్పు చేయలేదు..  
  2. రాష్ట్రంలో త్రీడీ (డిస్ట్రక్షన్, డిసెప్షన్, డిస్ట్రాక్షన్) పాలన
  3. గులాబీ శ్రేణులు ఆందోళన చెందొద్దు..
  4. లీగల్ టీంతో సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేద్దాం..
  5. బీఆర్‌ఎస్ డైరీ ఆవిష్కరణలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* ఇప్పుడు మేం ఇబ్బందుల్లో ఉన్నామని కొందరంటున్నారు. 2001లో మా పార్టీ అధినేత కేసీఆర్ ఎదుర్కొన్న పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చాలా చిన్నవి. ఫార్ములా ఈ రేస్ కేసు లొట్టపీసు కేసు. ఈ పైసా అవినీతి జరగలేదు. పీకేదేమీ లేదు. హైదరాబాద్ ఖ్యాతిని ఇనుమడింప జేసేందుకు మంత్రిగా నేను ఈ నిర్ణయం తీసుకున్నా 

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జనవరి 8(విజయక్రాంతి): ఫార్మూలా ఈ- రేస్ కేసులో పైసా అవినీతి జరగలేదని, తనను ఎవరూ ఏం పీకలేరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎవరికీ భయపడేదని లేదని, ఈ కేసుపై సుప్రీంకోర్టు వెళ్తానని స్పష్టం చేశారు. 

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన సిద్దిపేట ఎమ్మెలే హరీశ్‌రావుతో కలిసి పార్టీ డైరీని ఆవిష్కరించి మాట్లా డారు. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్ స్థాపించినప్పుడు ఉన్న పరిస్థితుల కంటే తనవి పెద్ద ఇబ్బందులు కావని కొట్టిపడేశారు. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి వంటి అమరుల త్యాగాలతో పొలిస్తే తమకు ఎదురవుతు న్న ఇబ్బందులు చాలా చిన్నవని స్పష్టం చేశా రు.

రాష్ట్రంలో త్రీడీ (డిస్ట్రక్షన్, డిసెప్షన్, డిస్ట్రాక్షన్) పాలన నడుస్తోందని కేటీఆర్ విమర్శిం చారు. తాను చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడినని, కేసీఆర్ రక్తం పంచుకుని పుట్టిన కొడుకునని, ఈ కేసు గురించి పార్టీ శ్రేణులు బాధపడొద్దని సూచించారు. పార్టీకి మంచి లీగల్ బృందం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పైనా కేంద్రం కక్షగట్టినా, అక్కడి ప్రజలు హేమంత్ సోరెన్‌ను గెలిపించారని గుర్తుచేశారు. జార్ఖండ్ ఏర్పాటు కోసం పోరాటం చేసి శిబు సోరెన్ కొడుకు కాబట్టి హేమంత్ సోరెన్‌కే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టినట్లు వెల్లడించారు.

బీఆర్‌ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నదని, తమ పార్టీకి కేసులనేవి సమస్యే కాదన్నారు. రైతుభరోసా పేరుతో సీఎం చేస్తున్న మోసాన్ని పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని సూచించారు. ప్రతి రైతుకు సర్కారు ఎకరానికి రూ.17వేల చొప్పున బాకీ ఉందన్న విషయాన్ని తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వా త ఒక్కసారి కూడా రైతులకు పెట్టబడి సాయం అందలేదని చెప్పాలని పిలుపునిచ్చారు.

నాడు రేవంత్‌రెడ్డి కనిపించిన ప్రతి దేవుడి పైనా ఒట్టేసి రుణమాఫీపై ఒట్టువేశారని గుర్తుచేశారు. అయినప్పటికీ సీఎం 100 శాతం రుణమాఫీని అమలు చేయలేదని మండిపడ్డారు. రైతు డిక్లరేషన్ పేరిట ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అబద్ధాలు చెప్పి రైతుల గొంతు కోశారని విరుచుకుపడ్డారు.

మేడిగడ్డకు పర్రే పడ్డదని అంటున్న ప్రభుత్వానికి, వెంటనే మరమ్మతులు చేసి యాసంగికి నీళ్లిచ్చే ఆలోచనే లేదని మండిపడ్డారు. యాసంగికి డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేటకు ఎం దుకు నీరు ఇవ్వలేదో తెలపాలని నిలదీశారు. త్వరలో బీఆర్‌ఎస్ కొత్త కమిటీలను ఎన్నుకోనున్నట్లు స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మండ లిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి,  సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పార్టీ నేతలు పొన్నాల లక్ష్మయ్య, కర్నే ప్రభాకర్, కొప్పుల ఈశ్వర్, మహ్మద్ అలీ పాల్గొన్నారు.

ప్రశ్నించే వాళ్లపై కేసులు: ఎమ్మెల్యే హరీశ్‌రావు 

కుట్రలో భాగంగానే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు ఏడాది ముగిసిందని, సంవత్సర కాలంలో సీఎం ప్రజలకు మేలు చేయడం పక్కన పెట్టి కోతలు, లేకపోతే ఎగవేతలు, కాదంటే కేసుల పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

ప్రశ్నించే వాళ్లపై అక్రమంగా కేసు లు బనాయిచండం తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి ఏమీ తెలియదని దుయ్యబట్టారు. లగచర్ల, సినీస్టార్ అల్లు అర్జున్, తెలంగాణ తల్లి విగ్రహం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డ పెండ్లికి తులం బంగా రం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ఆయన  సీఎంను ప్రశ్నించారు.

కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, బతుకమ్మ చీరెలు, రైతుబంధు, దళిత బంధు ఇలా అన్ని బంద్ అయ్యాయన్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని, ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ రైతుభరోసా నాటకం మొదలు పెట్టిందన్నారు.

ఎన్నికల తర్వాత మళ్లీ రైతు భరోసా పక్కకుపోతుందని జోస్యం చెప్పా రు. బీఆర్‌ఎస్ కట్టిన ఫ్లు ఓవర్లు, భవనాలు, ప్రాజెక్టులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు.